సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

కందనూలు: సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం పాలెం జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సైబర్‌ సెల్‌ ఆధ్వర్యంలో ‘సైబర్‌ సెక్యూరిటీ, భద్రత, నార్కోటిక్స్‌– యాంటీ డ్రగ్స్‌పై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు సైబర్‌ మోసాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మన సెల్‌ఫోన్‌కు వచ్చిన ప్రతి మెసేజ్‌ను ఓపెన్‌ చేయకూడదని, డిజిటల్‌ అరెస్ట్‌, పార్ట్‌ టైం జాబ్‌ ప్రకటనలు, ఈజీ లోన్లు, పెట్టుబడుల మోసాలు, అపరిచితుల సలహాల పట్ల విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంక్‌ లావాదేవీలు, ఫేక్‌ కాల్స్‌, ఐడెంటిటీ థెఫ్ట్‌, కస్టమర్‌ కేర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్‌ మోసానికి గురైతే తక్షణమే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌ను లేదా డయల్‌ 112 కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, జిల్లా సైబర్‌ సెల్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ గిరి మనోహర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ శారద తదితరులు పాల్గొన్నారు.

అక్రమ లేఅవుట్లపై

కఠిన చర్యలు

కందనూలు: అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. గురువారం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్‌ ఎదుట ఉన్న ప్రైవేటు లేఅవుట్లను కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లే అవుట్ల ఏర్పాటు ప్రభుత్వ నిబంధనలు, మున్సిపల్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేదా అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు లేఅవుట్లు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకే జరగాలని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా లేఅవుట్లలో రహదారులు, ప్రజా అవసరాలకు కేటాయించే స్థలాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిర్దేశించిన ప్రదేశాలను నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు లేఅవుట్ల విషయంలో మున్సిపల్‌ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు ఏర్పాటు చేయకుండా ముందస్తు పర్యవేక్షణ చేయాలని, ఇప్పటికే ఏర్పాటు చేసిన లేఅవుట్లను కూడా పరిశీలించాలని సూచించారు. అలాగే లేఅవుట్ల హద్దులు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములు, రహదారులు లేదా ప్రజా అవసరాలకు సంబంధించిన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి, ఆర్డీఓ అర్చన పాల్గొన్నారు.

సదరం క్యాంపు నూతన భవనం ప్రారంభం

కందనూలు: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి గురువారం దివ్యాంగుల కోసం నిర్మించిన సదరం క్యాంపు నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దేవసహాయం, డీఆర్‌డీఓ చిన్న ఓబులేషు తదితరులు పాల్గొన్నారు.

అమ్రాబాద్‌ ఎఫ్‌డీఓగా

చంద్రప్రకాష్‌ సింగాల్‌

మన్ననూర్‌: అమ్రాబాద్‌ అటవీశాఖ ఫారెస్టు డివిజన్‌ (ఎఫ్‌డీఓ) అధికారిగా చంద్రప్రకాష్‌ సింగాల్‌ ఐఎఫ్‌ఎస్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. 2024 బ్యాచ్‌కు చెందిన ఆయన డెహ్రాడూన్‌లో ఐజీఎన్‌ఎఫ్‌ఏలో రెండేళ్ల శిక్షణతోపాటు అంతకు ముందు మహదేవ్‌పూర్‌లోని పెగడపల్లి ఫారెస్టు రేంజ్‌లో ఓజేటీగా శిక్షణ పూర్తిచేశారు. ఈ సందర్భంగా మన్ననూర్‌లోని ఎఫ్‌డీఓ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ అటవీ, వన్యప్రాణుల సంరక్షణతోపాటు అటవీ సంపద అక్రమ రవాణా, వన్యప్రాణుల వేట, అటవీ నేరాల నివారణకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజల భాగస్వామ్యంతో కృషిచేస్తానన్నారు. అంతకు ముందు ఇక్కడ ఎఫ్‌డీఓగా విధులు నిర్వహించిన రామ్మూర్తి మంచిర్యాల జిల్లా చెన్నూర్‌కు బదిలీపై వెళ్లారని ఎఫ్‌ఆర్‌ఓ వీరేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement