కందనూలు: మానసిక దృఢత్వానికి క్రీడలు దోహదం చేస్తాయని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో పోలీసు అధికారులు, సిబ్బంది కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఇండోర్ షటిల్ కోర్టును ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించి మాట్లాడా. పోలీసు శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమై ఉంటారని, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో సేవలందించడం వంటి బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటారని, ఇలాంటి పరిస్థితుల్లో క్రీడలు వారికి శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్నారు. పోలీసు సిబ్బందికి మెరుగైన క్రీడా వసతులు కల్పించేందుకు రూ.8 లక్షల నిధులతో ఇండోర్ షటిల్ కోర్టును ఎస్పీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది నిరంతరం ప్రజా సేవలో ఉంటారని, అనేక సందర్భాల్లో రాత్రింభవళ్లు విధులు నిర్వహించాల్సి వస్తుందని, ఈ క్రమంలో పని ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. క్రీడల ద్వారా శారీరక ఫిట్‌నెస్‌ను పెంపొందించుకోవడంతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్ చెన్నయ్య, ఏఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఆర్డీఓ అర్చన, డీఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి పాల్టొన్నారు.


