జిల్లాలో స్పష్టంగా ఎల్‌నినో ప్రభావం
● సీజన్ సగం గడిచినా జాడలేని భారీ వర్షాలు
● జూలైలో 6.93 మీటర్ల లోతుకు భూగర్భజలాలు
● ఇదే పరిస్థితి కొనసాగితే వేసవిలో తాగునీటికీ ఇబ్బందులే
● ఈ నెల 15 వరకే వరిపంట సాగుకు అవకాశం
నాగర్‌కర్నూల్: జిల్లాలో ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ పంటల సాగుపై ప్రభావం చూపిస్తోంది. చెరువులు, కుంటల్లోకి నీరు రాకపోవడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ప్రధాన పంట పత్తి సాగు చేసినా వర్షం లేక ఎదుగుదల సమస్యగా మారింది. వాటిని కాపాడుకోవడం, పెరగడానికి నీరు ఉన్న రైతులు స్ప్రింక్లర్ల సహాయంతో అష్టకష్టాలు పడుతున్నారు. రెండో ప్రధాన పంటైన వరి సాగుకు ఆశతో అధికంగా వరినారు పోశారు. తీరా వర్షాలు లేకపోవడంతో సగానికి నాటడానికి ప్రయత్నిస్తున్నారు. నాటిన వరికి ఇప్పుడే నీరు పారడం లేదని పంట చేతికొచ్చే వరకు అనుమానమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేఎల్‌ఐ సాగునీరు వస్తే పంట చేతికొస్తుందని ఆశతో ఉన్నారు. పంటల కోసం సాగునీరు వదలడం అంత సులువుగా కనిపించడం లేదు. ఇక ఈ ఏడాది ఖరీఫ్ సాగులో రైతుకు పంట చేతికొచ్చే వరకు ఆందోళన తప్పేలా లేదు.
వరి సాగు అంచనా 1.93 లక్షల ఎకరాలు
జిల్లాలో వానాకాలం వరి సాగు అంచనా 1.93 లక్షల ఎకరాలు కాగా.. గతేడాది 1.80 లక్షల ఎకరాల వరిసాగు లక్ష్యం కాగా పూర్తిస్థాయిలో నెరవేరింది. దీంతో వ్యవసాయాధికారులు ఈ ఏడాది 13 వేల ఎకరాల లక్ష్యాన్ని పెంచగా.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక వారి అంచనాలు తారుమారు అయ్యాయి. ఇప్పటికే వరినారు పోసుకున్నా వర్షం కురవకపోవడం, చెరువుల్లో నీరు అడుగంటి బోర్లు సైతం తక్కువగా పోస్తుండటంతో ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు 66,710 ఎకరాలు (31 శాతం) మాత్రమే సాగు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నెల 15 వరకు మాత్రమే
వరినాట్లు వేయడానికి అవకాశం ఉందని, ఆ తర్వాత సాగు చేస్తే దిగుబడి సక్రమంగా రాదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కేఎల్‌ఐ ఎత్తిపోతల కింద పంటల సాగుకు నీరు వదలడం కష్టమేనని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద ప్రవాహం ఆగిపోయింది. పూర్తిస్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టు నిండలేదు. ఇప్పుడే సాగుకు నీరు ఇస్తే రాబోయే రోజుల్లో తాగునీటికి కష్టమవుతుందని పేర్కొంటున్నారు. మరోవైపు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సైతం వర్షాలు కురవడం అంతంతేనని వాతావరణ శాఖ చెబుతోంది.


