సర్‌.. 85.51 శాతమే | - | Sakshi
Sakshi News home page

సర్‌.. 85.51 శాతమే

Aug 11 2026 1:42 AM | Updated on Aug 11 2026 1:42 AM

జిల్లాలో ముగిసినస్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ సర్వే

8,35,408 మంది ఓటర్ల వివరాలు డిజటలైజేషన్‌ పూర్తి

లెక్క తేలని ఓటర్లు 1,41,579

ఫారాలు ఇవ్వనివారి పేర్లు

జాబితాలో నుంచి తొలగింపు

భవిష్యత్‌లోనూ కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవడానికీ తిప్పలే

అచ్చంపేట: జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) సర్వే సోమవారం అర్ధరాత్రితో ముగిసింది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం జిల్లాలో ఓటర్ల ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌, బీఎల్‌ఓల వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 9,76,987 మంది ఓటర్లు ఉండగా.. వారికోసం 1,100 మంది బీఎల్‌ఓలు వందశాతం ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తిచేశారు. ఇప్పటి వరకు 8,35,408 ఫారాలను డిజిటలైజేషన్‌ చేయగా.. ఇది మొత్తం ఓటర్లలో 85.51 శాతంగా నమోదైంది. 1,41,579 మంది ఓటర్ల వివరాలు రకరకాల కారణాలు, తప్పులతో నమోదయ్యాయి. చిరునామా మారడం లేదా ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో అన్‌ కలెక్టబుల్‌గా మిగిలాయి. ఓటర్ల నమోదులో దొర్లిన అక్షర దోషాలు, సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

ఫారం సమర్పించ లేదా..

సర్‌–2026 కార్యక్రమంలో భాగంగా బీఎల్‌ఓలకు ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వని వారి పేర్లు ఈ నెల 17న ప్రకటించనున్న ముసాయిదా ఓటరు జాబితాలో కనిపించవు. ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు కొత్తగా ఓటరుగా నమోదు కావాలంటే ఫారం–6 దరఖాస్తు చేసుకోవాలి. దీనికి తోడు సర్‌–2002 ఓటర్ల జాబితాలో ఉన్న మీ ఓటు లేదా మీ బంధువుల ఓట్ల వివరాలు స్వీయ ధ్రువీకరణ ఫారంలో నింపాల్సి ఉంటుంది. సర్‌ షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 9లోగా కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తుతోపాటు ముసాయిదా జాబితాపై క్లెయిమ్స్‌, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ వ్యవధిలో ఫారం–6 దరఖాస్తు చేసుకున్న వారికి ఈఆర్‌ఓ నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారు. దీనికి హాజరై కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాాల ధ్రువీకరణ ప్రతాల్లో ఏదో ఒకటి పుట్టిన తేదీ, నివాస చిరునామాగా చూపించాలి. భవిష్యత్‌లో సర్‌–2026 ఓటర్ల జాబితా ఓటర్లకు కీలక ఆధారంగా మారనుంది. అక్టోబర్‌ 12న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో పేరు రాకుంటే భవిష్యత్‌లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.

సొంతూరికే జైకొట్టారు..

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రెండు ఓట్లు కలిగి ఉండటం నేరం. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో.. ఇప్పుడు డబుల్‌ ఓట్లకు చెల్లు చీటి ఇస్తూ.. ఒకే ఓటుకు చాన్స్‌ ఇవ్వడంతో పట్టణాల్లో ఓటర్ల సంఖ్య తగ్గింది. గ్రా మాలు, పట్టణాల్లో రెండు ఓట్లు కలిగిన వారిలో చాలా మంది సొంతూరిలోనే ఓటు నమోదుకు ఇష్టపడ్డారు. బతుకుదెరువు, వ్యాపారం, ఉపాధి, పిల్లల చదువుల కోసం ఇతర ప్రాంతాలు, పట్టణాలకు వెళ్లిన వారు ఆధార్‌ కార్డు, 2020 నాటి ఓటర్ల జాబితా ప్రామాణికంగా తీసుకుని, కొత్త ఫొటోను అందించారు.

ఆ తర్వాత తప్పుల సవరణ

ఓటర్ల నమోదులో దొర్లిన తప్పులను డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ తర్వాత సరిదిద్దనున్నారు. దీనికి వచ్చే రెండు నెలల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఓటర్ల నుంచి ఆధారాలు స్వీకరించి.. నోటీసులు ఇచ్చి నమోదులో ఉన్న తప్పులను సరిదిద్దుతారు. ప్రధానంగా పేరులో అక్షర దోషాలు, ఇంటి పేరు తప్పు, డీఎస్సీ ఎర్రర్‌, వయసులో తేడాలు, కుటుంబ సభ్యుల మ్యాపింగ్‌లో దొర్లే పొరపాట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 2002లో ఓటరు జాబితాలో ఉన్న పేరుకు ప్రస్తుత పేరుకు కొద్దిపాటి తేడా ఉన్నవి చాలానే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement