పెంట్లవెల్లి: అత్యాధునిక సదుపాయాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని జటప్రోల్‌లో పాఠశాల పనులను అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, నాణ్యత విషయంలో రాజీపడకూడదని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సమానంగా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తుందన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి పాఠశాలలు అందుబాటులోకి తీసుకురావాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమన్నారు. విద్యతోపాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ఆధునిక వసతులు, ప్రయోగశాలలు, క్రీడా సదుపాయాలతో పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని, బాలురు, బాలికలకు ప్రత్యేకంగా దాదాపు 2500 మంది విద్యార్థులు చదువుకునేలా పాఠశాల నిర్మిస్తున్నామని చెప్పారు. నిర్మాణ పనులను వచ్చే ఏడాది జూన్ వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మండలంలోని గోప్లాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రామన్‌గౌడ్, గోవింద్‌గౌడ్, గోపినాయక్, నర్సింహ, వేణుగోపాల్, ఆంజనేయులు, లోకంగౌడ్, భీంరెడ్డి, నాగిరెడ్డి, ఆసిఫ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు


