దుందుభీ వాగుపై సా..గుతున్న వంతెన నిర్మాణం
నాగర్‌కర్నూల్: కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట – రామగిరి మార్గంలో దుందుభీ వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణానికి గ్రహణం పట్టింది. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి గత ప్రభుత్వం 2023లో రూ. 45కోట్లు మంజూరు చేసింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం రావడం.. టెండర్ల ప్రక్రియ పూర్తికావడానికి రెండేళ్ల సమయం పట్టింది. ఎట్టకేలకు 2025 మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఐదు నెలలపాటు పనులు సాఫీగా సాగాయి. ఆ తర్వాత భారీ వర్షాలు కురిసి, వాగుకు వరద రావడంతో పనులు నిలిచిపోయాయి. తీరా వర్షాలు ముగిసి, వరద తగ్గుమొఖం పట్టినప్పటికీ చేసిన పనులకు బిల్లు రాకపోవడంతో పనులు పునఃప్రారంభానికి నోచుకోలేదు. మరోవైపు బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో డైవర్షన్ రోడ్డు ఏర్పాటుకు భూ సమస్య తలెత్తింది. ఫలితంగా బ్రిడ్జి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.
ఇదీ పరిస్థితి..
రఘుపతిపేట – రామగిరి మార్గంలో దుందుభీ వాగు దాదాపు 500 మీటర్లు (అర కిలోమీరు) పైగా పొడవు ఉంటుంది. 11 ఫిల్లర్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఒక్కో ఫిల్లర్ మధ్యలో 40 మీటర్ల దూరం ఉంటుంది. అటు చివర, ఇటు చివర రెండు అపార్టమెంట్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏడు ఫిల్లర్లు నిర్మించగా.. రఘపతిపేట వైపు మరో నాలుగు నిర్మించాల్సి ఉంది. రామగిరి పైపు అపార్టుమెంట్ పూర్తి కాగా.. రఘుపతిపేట వైపు డైవర్షన్ సమస్యతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. నాలుగైదు నెలల్లో రూ. 8కోట్ల పనులు చేశారు. అంతలోనే వర్షాలు కురిసి, వరదలు రావడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత బిల్లు సకాలంలో రాకపోవడంతో వర్షాలు ముగిసినా పనులను పునఃప్రారంభించలేదు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ పనులకు ఆటంకంగా మారింది. వచ్చే అక్టోబర్‌లో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఏడాదిన్నరలో బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తగ్గనున్న దూరభారం..
రఘుపతిపేట –రామగిరి నడుమ దుందుబీ వాగు వచ్చిందంటే, రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఎవరు వాగు దాటకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి మీదుగా తెలకపల్లి, లింగాల మండలాల్లోని అనేక గ్రామాలకు ఈ మార్గం చాలా దగ్గరగా ఉంటుంది. ఆర్‌అండ్‌బీ రహదారి కావడంతో డబుల్ రోడ్డుగా విస్తరించారు. జీన్‌కుంట, పోలేపల్లి, ఉప్పరిపల్లి, మామిళ్లపల్లి, దాసర్లపల్లి, రామగిరి తదితర గ్రామాలకు హైదరాబాద్, కల్వకుర్తి నుంచి రావడానికి 30 కి.మీ. దూరం తగ్గుతుంది. వర్షాకాలంలో వాగు వచ్చిందంటే.. ఆయా గ్రామాల ప్రజలు అచ్చంపేట, నాగర్‌కర్నూల్ మీదుగా వెళ్లాల్సిందే. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగు పడనుంది.
మూడేళ్ల క్రితం రూ.45కోట్లు
మంజూరు
వర్షాకాలంలో ముందుకు సాగని పనులు
ప్రజలకు తప్పని ఎదురుచూపులు


