మన్ననూర్: ప్రకృతితో మమేకమై జీవిస్తున్న ఆదివాసీల హక్కులు, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్ కోరారు. ఆదివారం మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురం భీం చిత్రపటానికి ఆదివాసీ మహిళలు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. ఆదివాసీలు తరతరాలుగా ప్రకృతి పరిరక్షణే తమ జీవనంగా మలుచుకున్నారని అన్నారు. వారి సంస్కృతీ సంప్రదాయాలు, సమష్టి జీవన విధానం మానవాళికి మార్గదర్శకమని కొనియాడారు. అదే విధంగా పీవీటీజీ పాఠశాల/కళాశాలలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాయిబాబుగౌడ్ పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కందనూలు: నాగర్‌కర్నూల్ మండలంలోని మంతటి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా సోమవారం పలు గ్రామాలకు విదు్‌య్త్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మాన్యానాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మంతటి, గగ్గలపల్లి, వనపట్ల, అవురాసిపల్లి, అనంతసాగర్, గడ్డంపల్లి, రాయిపాకుల, గౌతంపల్లి గ్రామాల పరిధిలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు, రైతులు గమనించి, సహకరించాలని ఆయన కోరారు.
13న సహస్ర
ఘట్టాభిషేకం
అచ్చంపేట రూరల్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవాలని కాంక్షిస్తూ ఈ నెల 13న ఉమామహేశ్వర క్షేత్రంలో సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, అనురాధ దంపతులచే ఆలయ ఆవరణలో మహా వరుణయాగం ఉంటుందని.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.
సాహితీ రంగంలో తనదైన ముద్రవేసిన యశోదారెడ్డి
స్టేషన్ మహబూబ్‌నగర్: సాహితీ రంగంలో తెలంగాణ సాహితీ దిగ్గజం పాకాల యశోదారెడ్డి తనదైన ముద్రవేశారని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి అన్నారు. పాకాల యశోదారెడ్డి జయంతిని పురస్కరించుకొని నగరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. సదస్సుకు సంచాలకులుగా మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ, సహ సంచాలకులుగా ప్రధాన కార్యదర్శి శాంతారెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవారెడ్డి విజయలక్ష్మి మాట్లాడుతూ పాకాల యశోదారెడ్డి సాహిత్యంలోని మాండలికమంతా తెలంగాణ, బిజినేపల్లి ప్రాంతానికి చెందినదే అన్నారు. యశోదారెడ్డి కుమార్తె పాకాల లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ సేవలను కొనియాడారు. ఆచార్య చందోజీరావు మాట్లాడుతూ యశోదారెడ్డి స్ఫూర్తితో విద్యార్థులు వర్తమాన పరిశోధకులుగా, కథా రచయితలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రారంభ సదస్సుకు రావూరి వనజ సభాధ్యక్షత వహించగా.. సదస్సులో పలువురు పరిశోధకులు పత్రసమర్పణ చేశారు. సమావేశంలోలో మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ జయప్రద, జి.శాంతారెడ్డి, డాక్టర్ భారతి, ప్రముఖ అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి, మేకల అనురాధ, జయలక్ష్మమ్మ, డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, గన్నోజు శ్రీనివాసాచారి, కె.వీణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


