కందనూలు: తల్లిదండ్రుల కలలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల్లో 2025–26 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్‌లో 990 పైగా మార్కులు సాధించిన ఐదుగురు విద్యార్థులతో పాటు పదో తరగతిలో 585 పైగా మార్కులు సాధించిన ఏడుగురు విద్యార్థులకు ఆదివారం ఎంపీజే చారిటబుల్ ట్రస్ట్, బీసీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో ఉన్నతంగా రాణించి.. తల్లిదండ్రులు, చదువుకున్న పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రతిభా విద్యార్థులను శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో ట్రస్టు ఫౌండర్ పచ్చిపాల సుబ్బయ్య, రిటైర్డు డీఈఓ విజయ్‌కుమార్, బీసీటీఏ నాయకుడు భాస్కర్ పాల్గొన్నారు.


