ఎన్‌ఎంఎంఎస్ ఉపకారంతో ఆర్థికంగా తోడ్పాటు
పరీక్ష విధానం ఇలా..
● ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న
విద్యార్థులు అర్హులు
● పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే
నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.12 వేల చొప్పున అందజేత
● జిల్లాలో అత్యధికంగా గౌరెడ్డిపల్లి పాఠశాల విద్యార్థుల ఎంపిక
● ఈ నెల 24 వరకు దరఖాస్తుల స్వీకరణ
గురువుల సహకారంతో ప్రణాళికాబద్ధంగా చదివి మోడల్ పేపర్లను సాధన చేసి, మెంటల్ ఎబిలిటీ, గణితం, సోషల్, సైన్స్ సబ్జెక్టులను క్రమం తప్పకుండా అభ్యసించి పరీక్షలో విజయం సాధించాను. ఈ స్కాలర్‌షిప్ రెండేళ్ల నుంచి ఏడాదికి రూ.12 వేల చొప్పున పొందుతున్నాను.
– కార్తికేయ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గౌరెడ్డిపల్లి, తెలకపల్లి మండలం
ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పథకం పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మా పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో మేం గతేడాది ఐదు మంది విద్యార్థులం ఎంపికయ్యాం. భవిష్యత్‌లో ఇంకా ప్రతిభా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించి పాఠశాలకు పేరు తీసుకొస్తాను.
– అంకిత, ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
గౌరెడ్డిపల్లి, తెలకపల్లి మండలం
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీస్తూ.. వారికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఎంఎంఎస్ పథకం పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఈ ఉపకార వేతనం ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా పేద పిల్లలు విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఉపకార వేతనం ఇవ్వనుంది. పరీక్షల్లో ఎంపికై న విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం నాలుగేళ్లపాటు లభిస్తుంది.
50 శాతం మార్కులు
ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 7వ తరగతిలో 50 శాతం, బీసీ, ఇతర విద్యార్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండి, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం హెచ్‌ఎం సంతకంతో దరఖాస్తు ఫారాలను డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
56 మంది విద్యార్థులు
జిల్లాలోని తెలకపల్లి మండలం గౌరెడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 2017 నుంచి 2026 వరకు మొత్తం 56 మంది విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు ఎంపికయ్యారు. ప్రతి సంవత్సరం గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయిలో నిలబెడుతూ మెరుగై ఫలితాలు సాధిస్తూ జిల్లాస్థాయిలో ముందంజలో నిలుస్తోంది.
24 వరకు గడువు..
ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఈ నెల 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలో ప్రతిభచాటిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున నాలుగేళ్లపాటు రూ.48 వేల ఉపకార వేతనం పొందే అవకాశం ఉంటుంది. నవంబర్ 1న పరీక్ష నిర్వహిస్తారు.
ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష 180 మార్కులకు ఉంటుంది. ఇందులో మొదటి విభాగంలో మానసిక సామర్థ్య పరీక్షకు 90 మార్కులు కేటాయిస్తారు. రీజనింగ్, ఆర్థమెటిక్ సామర్థ్యం, పదాల భిన్న పరీక్ష, అంకెలు, అక్షరాల ఎకనాలజీ, కోడింగ్– ఢీకోడింగ్, లాజికల్ ప్రశ్నలు, వెన్‌చిత్రాలు, అద్దం, నీటి ప్రతిబింబాలకు సంబంధించి ప్రశ్నలుంటాయి.
రెండో విభాగంలో 7, 8 తరగతుల సిలబస్ నుంచి 90 మార్కులకు 90 ప్రశ్నలుంటాయి. వీటిలో గణితం 20 మార్కులు, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల నుంచి 35 మార్కులు, సాంఘికం నుంచి 35 మార్కుల చొప్పున ఉంటాయి. పరీక్ష తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో బహుళైచ్ఛిక రూపంలో ఉంటుంది.


