కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిలను శనివారం రాష్ట్ర హౌజింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. సోమశిలకు వచ్చిన ఆయనకు జిల్లా పీడీ గోపాల్‌నాయక్, డీఈ హరినాయక్, జిల్లా పర్యాటక శాఖ అధికారి నర్సింహ ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ సోమేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ కుటుంబ సభ్యులను అధికారులు శాలువాలతో సత్కరించారు.
శనేశ్వరుడికి
అభిషేక పూజలు
కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శ్రీశనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు తిలతైలాభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి మాట్లాడుతూ ప్రతిఒక్కరు జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలని సూచించారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్‌రావు, సర్పంచ్ సుగుణమ్మ, కమిటీ సభ్యులు రాజేష్ పాల్గొన్నారు.
సిర్సనగండ్ల ఆలయ అభివృద్ధికి సహకరించండి
చారకొండ: అపర భద్రాదిగా పేరుగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించి నిధులు మంజూరు చేయాలని ఆలయ చైర్మన్ డేరం రామశర్మ అన్నారు. శనివారం దేవాలయం ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏటా శ్రీరామనమిని పురస్కరించుకొని రాష్ట్రంలోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారని, ఈ క్రమంలో సౌకర్యాలు లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జిల్లా మంత్రి కొంత వరకు నిధులు మంజూరు చేసినా పూర్తిస్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఆలయాన్ని యాదాద్రి తరహాలో తీర్చిదిద్దడానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.వంద కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు నాగర్‌కర్నూల్ ఎంపీ, జిల్లాలోని ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు.


