అందుబాటులోకి కొత్త పింఛన్ల కోసం చేయూత పథకం ఫారం
● వృద్ధాప్య కాలం లేకుండా
విడుదల చేసిన ప్రభుత్వం
● దరఖాస్తుల స్వీకరణ బాధ్యత
కార్యదర్శి, బిల్లు కలెక్టర్లదే..
● మార్గదర్శకాల్లో కీలక అంశాలు వెల్లడి
నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ద్వారా పింఛన్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. వివిధ వర్గాలకు ఇవ్వడానికి అనుమతి ఇస్తూ.. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం నూతన ఫారం విడుదల చేసింది. అయితే వృద్ధాప్య పెన్షన్‌దారులకు మొండిచేయి చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫారంలో ఎక్కడ వృద్ధాప్య పింఛన్ల కాలం లేకపోవడమే ఇందుకు కారణం. వితంతువులు, దివ్యాంగ, ఒంటరి మహిళలు, గీత, చేనేత ఇతరత్రా కాలాలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఎన్నో రోజుల నుంచి పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు నిరాశే మిగిలినట్లయింది. కాగా ఇతర వర్గాల వారు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ ద్వారా బోగస్ పెన్షను ఏరివేసిన స్థానంలో ఆ సంఖ్యకు అనుగుణంగా కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.
వారిదే బాధ్యత..
ప్రభుత్వం నూతన పింఛన్ల దరఖాస్తు కోసం ఫారం విడుదల చేసింది. చేయూత పథకం పేరిట విడుదల చేసిన ఫారం నమూనాను ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శి ఇతర శాఖల అధికారులకు పంపించారు. అందులో స్పష్టంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులతోపాటు పైలేరియా, డయాలసిస్ వారికి మాత్రమే కాలం పేర్కొన్నారు. ఎక్కడా వృద్ధాప్య అని లేకపోవడంతో వారు నమోదు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దరఖాస్తు ఫారాలను గ్రామ కార్యదర్శితోపాటు బిల్లు కలెక్టర్లు తీసుకోవాలి. ఆ తర్వాత రూరల్ ఏరియాలో ఎంపీడీఓలు, అర్బన్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి.. ధ్రువీకరించేలా పొందుపరిచారు. పైలేరియా పేషెంట్లకు జిల్లా మలేరియా అధికారి, డయాలసిస్ బాధితులకు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ ధ్రువీకరించాలని నిబంధనలో పేర్కొన్నారు.
జత పర్చాల్సినవి ఇవే..
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు ఫారం నింపడంతోపాటు వితంతువులు భర్త చనిపోయిన ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు, లేకపోతే ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలు పెళ్లి కాలేదని, ఒంటరిగా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు యూడీఐడీ సర్టిఫికెట్, గీత కార్మికులు సొసైటీలో సభ్యుడిగా ఉన్న పత్రం, చేనేత కార్మికులు టెక్స్‌టైల్స్ డిపార్టుమెంట్ ధ్రువీకరణ పత్రం జతపరచాల్సి ఉంటుంది.
అధికంగా వృద్ధులే..
కొత్త పింఛన్ల కోసం ఎక్కువగా ఎదురుచేసేది వృద్ధులే. గ్రామాలకు నాయకులు, అధికారులు ఎవరు వచ్చినా.. వారి వద్దకు వచ్చి పింఛన్ ఇవ్వండి అంటూ వేడుకుంటారు. ప్రభుత్వమేమో అధికంగా వృద్ధాప్య పింఛన్‌దారులు ఉంటారని, ప్రస్తుతం తక్కువగా ఉండే లబ్ధిదారులను ఎంచుకుంటే ప్రభుత్వపై భారం ఉండదని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వృద్ధాప్య పింఛన్లు అయితే వయస్సు 57 ఏళ్లు నిండిన వారికి ఇవ్వాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం ఈ వయస్సు వారికి ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల సమయంలో వారికే ఇస్తామని ప్రచారం చేసింది. దీంతో ఈ వయస్సు వారికి ఇవ్వాలంటే గ్రామంలో 10 నుంచి 100 మంది వరకు లబ్ధిదారులు ఉంటారు. వీరందరికీ ఇస్తే అధిక భారం అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వృద్ధాప్య పెన్షన్‌దారులు దరఖాస్తులు ఇస్తే తీసుకోవాలని గ్రామ కార్యదర్శులకు ఉచిత సలహా ఇచ్చారు. వారిని నిరాశపరచకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు సమాచారం.


