టూరిజం ఉద్యోగులపై దాడులను సహించం | - | Sakshi
Sakshi News home page

టూరిజం ఉద్యోగులపై దాడులను సహించం

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

కొల్లాపూర్‌ రూరల్‌: జిల్లాలో ఎవరైనా టూరిజం ఉద్యోగులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టూరిజం కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ రవీందర్‌నాయక్‌, విజిలెన్స్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ తమ్మయ్య హెచ్చరించారు. శుక్రవారం సోమశిలలో టూరిజం ఉద్యోగులపై దాడికి పాల్పడిన స్థలాన్ని జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాళ్ల నర్సింహ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాత్రివేళలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేలా బోటింగ్‌ పాయింట్‌ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దాడికి గురైన పర్యాటక శాఖ ఉద్యోగులు దేవరాజు, శివలకు వైద్యం చేయించి పూర్తి ఖర్చులను టూరిజం కార్పొరేషన్‌ చెల్లిస్తుందన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. కార్యక్రమంలో టూరిజం పోలీసు అధికారులు శివశంకర్‌, శివప్రసాద్‌, ప్రేమ్‌కుమార్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పంచముఖి ఆలయానికి ప్రత్యేక బస్సు సర్వీసు

కొల్లాపూర్‌: అమావాస్యను పురస్కరించుకొని ఈ నెల 12న కొల్లాపూర్‌ నుంచి పంచముఖి ఆలయానికి ప్రత్యేక బస్సు నడిపిస్తున్నట్లు కొల్లాపూర్‌ డిపో మేనేజర్‌ మల్లేశయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు కొల్లాపూర్‌ నుంచి డీలక్స్‌ బస్సు పంచముఖికి బయలుదేరి.. గురువారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణం అవుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో జోగుళాంబ, బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయాల దర్శనం ఉంటుందన్నారు. రానుపోను ప్రయాణ చార్జీలు పెద్దలకు రూ.900, పిల్లలకు రూ.500గా నిర్ణయించినట్లు వెల్లడించారు.

రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కల్వకుర్తి టౌన్‌: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలు, ఏటీసీ కళాశాలల్లో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను రెండో విడత ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఐటీఐ కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ జయమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు iti.tela ngana.gov.in వెబ్‌సైట్‌లో తమ మొబైల్‌ నంబర్‌తో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఒక సంవత్సరం, రెండేళ్ల ట్రేడ్లలో తమ ఆసక్తికి అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు సమయంలో ఎస్సెస్సీ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఒకటి నుంచి ఏడో తరగతి వరకు బోనోఫైడ్‌, స్టడీ సర్టిఫికెట్లు, ఫొటోతోపాటు ఇతర అవసరమైన పత్రాలను స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. మొదటి విడతలో దరఖాస్తు చేసుకుని సీటు రాని విద్యార్థులు తిరిగి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారు తమ లాగిన్‌లోకి వెళ్లి కొత్త ఆప్షన్లు మాత్రమే నమోదు చేసుకుంటే సరిపోతుందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement