కందనూలు: పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నమోదవుతున్న వివిధ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతోపాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మిస్సింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి వారి ఆచూకీ గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రేవ్, నాన్– గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించాలని పేర్కొన్నారు. క్రైమ్ అండ్ క్రిమినల్, మాన్యువల్ రికార్డుల నమోదుల మధ్య ఉన్న వ్యత్యాసాలను వెంటనే సరిచేయాలని సూచించారు. ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు సకాలంలో నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, ఫేక్ నంబర్ ప్లేట్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సకాలంలో సహాయం అందేలా ప్రతి కాల్‌ను అత్యంత ప్రాధాన్యంతో పరిగణించాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


