నూతన పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన | - | Sakshi
Sakshi News home page

నూతన పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

నాగర్‌కర్నూల్‌/ కందనూలు: జిల్లాలో ఎన్నికల నిర్వహణను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా చేపట్టడంతోపాటు ప్రతి ఓటరు తన ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ తెలిపారు. శుక్రవారం జిల్లాలో ప్రతిపాదించిన నూతన పోలింగ్‌ కేంద్రాలు, మార్పులు, పేర్ల సవరణలకు సంబంధించిన అంశాలపై కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 880 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఓటర్ల సంఖ్య, భౌగోళిక పరిస్థితులు, పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు చేరుకోవాల్సిన దూరం, గ్రామాల విస్తీర్ణం, ప్రజల సౌకర్యం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం మరో 30 కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, మరో ఐదు కేంద్రాల లొకేషన్లు, రెండు కేంద్రాల పేర్లను మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవడానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా 2 కి.మీ., పైగా దూరంలో ఉన్న ప్రాంతాలను గుర్తించి 27 కొత్త పోలింగ్‌ కేంద్రాలు, ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1,200 మందికిపైగా ఓటర్లు ఉన్న మూడింటి విభజనకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు. ఇవన్నీ అమలులోకి వస్తే ప్రస్తుతం ఉన్న 880 పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 910కు పెరుగుతుందని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

జనాభా వివరాలను గడువులోగా సేకరించాలి

జిల్లాలో జనాభా వివరాలను గడువులోగా సేకరించాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం ఆమె హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాలో కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జనాభా, విద్య, అక్షరాస్యత, ఎస్సీ, ఎస్టీ తదితర గణాంకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వ విధానాల రూపకల్పనతోపాటు అభివృద్ధి ప్రణాళికల అమలుకు ప్రామాణిక ఆధారంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ నెల 21లోగా గ్రామీణ, పట్టణ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ పూర్తి చేయాలని, వచ్చేనెల 8లోగా సమాచారాన్ని పరిశీలించి వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, సీపీఓ సుజాత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement