మత్స్యబీజం పడేనా? | - | Sakshi
Sakshi News home page

మత్స్యబీజం పడేనా?

Aug 7 2026 2:08 AM | Updated on Aug 7 2026 2:08 AM

వర్షాభావంతో చెరువుల్లోకి చేరని నీరు

చెరువుల్లోకి నీరు రాకపోతే నష్టపోతాం..

టెండర్లకు ఆహ్వానం..

జిల్లాలో 1,056 చెరువులు..

నాగర్‌కర్నూల్‌: ఎల్‌నినో ప్రభావం అన్నదాతలపైనే కాదు.. చేపల పెంపకంపై జీవనం సాగించే మత్స్యకారులపై కూడా పడుతోంది. వానాకాలం మొదలై రెండు నెలలు దాటినా జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో చెరువులు, కుంటలు నీరులేక వెలవెలబోతున్నాయి. చెరువుల్లోకి సకాలంలో నీరు చేరకపోతే చేపపిల్లల పెంపకం ప్రశ్నార్థకంగా మారనుంది. తద్వారా మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభు త్వం చేప విత్తనాల కోసం టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తోంది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

కేఎల్‌ఐ నీరు వదిలితే..

శ్రీశైలం జలాశయంలోకి సమృద్ధిగా నీరు చేరితే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వలకు నీటిని విడుదల చేయనున్నారు. వాటి ద్వారా గొలుసుకట్టు చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుంది. అయితే కేఎల్‌ఐ ద్వారా అక్టోబర్‌ తర్వాతే కాల్వలకు నీరు వదిలే అవకాశం ఉందని ఇరిగేషన్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అప్పటి వరకు చేపపిల్లలను చెరువుల్లో వదలకుండా ఉండటం కష్టమే. నీరు ఉన్న చెరువుల్లో మాత్రమే చేపపిల్లలను వదిలే అవకాశం ఉంది. కాగా, కేఎల్‌ఐ నుంచి ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లలోకి నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. వీటితో పాటు సోమశిల, మంచాలకట్టలో నిలిచే శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో 30లక్షల చేపపిల్లలను వదలనున్నారు. అదే విధంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ద్వార నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్‌ చేస్తే.. అక్కడ సైతం చేప పిల్లలు వదిలే అవకాశం ఉంటుంది. అయితే జిల్లావ్యాప్తంగా 2.20 కోట్ల చేపపిల్లలను వదలాలని లక్ష్యంగా నిర్దేశించారు.

235 సంఘాలు.. 17,900మంది సభ్యులు

జిల్లాలో 235 మత్స్య సహకార సంఘాలు ఉండగా.. 17,900 మంది సభ్యులు ఉన్నారు. కొల్లాపూర్‌ ప్రాంతంలో అత్యధికంగా మత్స్యకారులు ఉండగా.. చేపల పెంకంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చెరువుల్లోకి నీరు చేరకపోతే వీరి జీవనంపై తీవ్ర ప్రభావం పడనుంది.

చేప పిల్లల పెంపకంపై నీలినీడలు

మత్స్యకారుల జీవనోపాధిపై

తీవ్ర ప్రభావం

ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ

వర్షాభావంతో చెరువుల్లోకి నీరు రావడం లేదు. దీంతో చేపపిల్లలు పెంపకం కష్టంగా మారి మత్స్యకారుల జీవనం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. చేపపిల్లలు వదలాలంటే చెరువు, కుంటల్లో 60శాతం నీరు కచ్చితంగా ఉండాలి. ఆరునెలలకు చేపపిల్ల 750 గ్రాముల బరువు పెరుగుతుంది. చెరువుల్లోకి నీరు రాకపోతే ప్రభుత్వమే మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలి.

– వాకిటి ఆంజనేయులు,

మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు

మత్స్యకారులకు వందశాతం రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేయా లని ప్రభుత్వం నిర్ణయి ంచింది. ప్రస్తుతం చేప విత్తనాల కోసం టెండర్లను ఆహ్వానించడం జరిగింది. 17న తెరిచే అవకాశం ఉంది. జిల్లాలోని చెరువులు, కుంటల్లో నీటి పరిస్థితిని అంచనా వేసి, చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటాం.

– బి.లక్ష్మప్ప, జిల్లా మత్స్యశాఖ అధికారి

జిల్లావ్యాప్తంగా 1,056 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో 36 పెద్ద చెరువులు ఉండగా.. జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం, పాలెం, నందివడ్డేమాన్‌, అచ్చంపేట చంద్రసాగర్‌ తదితర చెరువుల్లో ప్రస్తుతం కొంతమేర నీరుంది. మిగతా చెరువులు, కుంటలు అడుగంటిపోతున్నాయి. చేపపిల్లల పెంపకానికి చెరువులు, కుంటల్లో 60 శాతం వరకు నీరు ఉండాలి. లేకపోతే చేప పిల్లల పెంపకం కష్టంగా ఉంటుంది. గతేడాది సమృద్ధిగా కురిసిన వర్షాలతో ఆగస్టు నెలాఖరులోగా దాదాపు అన్ని చెరువుల్లో 2.21కోట్ల చేపపిల్లలను వదిలిపెట్టారు. ఇందుకోసం రూ. 1.87కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. 12,800 టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో మత్స్యకారుల్లో గందరగోళం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement