కందనూలు: తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ, జనరల్ ఆస్పత్రి, ఎంపీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక బాలుర ఉన్నత పాఠశాల నుంచి చేపట్టిన భారీ అవగాహన ర్యాలీని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిశువు పుట్టిన వెంటనే తొలి అరగంటలో తల్లిపాలు అందించడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. జననం తర్వాత మొదటి, మూడు రోజుల్లో వచ్చే ముర్రు పాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన తొలి టీకా వంటిదని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయకుండా బిడ్డకు తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. రెండేళ్ల వరకు తల్లిపాలు కొనసాగించడం ద్వారా భవిష్యత్‌లో రక్తహీనత, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధుల ముప్పు తగ్గుతుందన్నారు. తల్లుల్లో సైతం రొమ్ము క్యాన్సర్, గర్భాశయ సంబంధిత క్యాన్సర్లు, ఆస్టియో పోరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గడమే కాకుండా.. తల్లీబిడ్డ మధ్య ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగ బంధం మరింత బలపడుతుందని చెప్పారు. బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, ఇతర రద్దీ ప్రాంతాల్లో బాలింతల కోసం ప్రత్యేకంగా పాలిచ్చే గదులు, అవసరమైన సౌకర్యాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లిపాల బ్యాంకుల ఏర్పా టుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా.కృష్ణ, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి, ఎంపీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ఎం.పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర పాల్గొన్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులు, గిరిజనులకు ఆధార్ నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లింగాల, బల్మూర్, అమ్రాబాద్, పదర, అచ్చంపేట మండలాల్లో నివసిస్తున్న చెంచు, గిరిజన కుటుంబాల పరిస్థితులు, చిన్నారుల ఆధార్ నమోదు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలోని చెంచు, గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందాలంటే, ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆధార్ నమోదు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీటీడీఓ కోటాజి, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, డీఈవో రమేశ్‌కుమార్ ఉన్నారు.


