నకిలీ ఎరువులు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ ఎరువులు విక్రయిస్తే చర్యలు

Aug 7 2026 2:08 AM | Updated on Aug 7 2026 2:08 AM

కల్వకుర్తి రూరల్‌: రైతులకు నకిలీ ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హెచ్చరించారు. ఇటీవల జిల్లాలో నకిలీ ఎరువులు వెలుగుచూసిన నేపథ్యంలో గురువారం కల్వకుర్తి మండలం మార్చాల, జీడిపల్లి గ్రామాల్లోని ఫర్టిలైజర్‌ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా, డీఏపీ ఇతర ఎరువులను పరిశీలించారు. అనంతరం దుకాణాల్లోని రికార్డులను పరిశీలించి.. స్టాక్‌ వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ అనుమతులు ఉన్న ఎరువులు, విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని డీలర్లకు సూచించారు. ఎరువులు, విత్తనాలు కొనే రైతులు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, ఏడీఏ మంజుల, సీఐ భీంకుమార్‌, తహసీల్దార్‌ ఇబ్రహీం, ఏవో సురేశ్‌ ఉన్నారు.

నియంతల ఆటలు సాగనివ్వం : సీపీఐ

పెద్దకొత్తపల్లి: దేశంలో విప్లవ శకం మొదలైందని.. ఇక నియంతల ఆటలు సాగవని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో పెద్దకొత్తపల్లి నుంచి చేపట్టిన పాదయాత్రను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాడుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను విస్మరించిన తీరును ప్రజలకు వివరించి.. చైతన్యవంతం చేసేందుకు పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నర్సింహ, ఇందరిమ్మ, తుమ్మల శివుడు, శ్రీనివాసులు, లక్ష్మీపతి, కుర్మయ్య, కిరణ్‌కుమార్‌, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

నేడు పీయూ

జాతీయ సదస్సు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూ ఆధ్వర్యంలో గురువారం షాద్‌నగర్‌ సమీపంలోని కన్హా శాంతివనంలో జాతీయసదస్సు నిర్వహించనున్నారు. ఈమేరకు శాంతివనంలో అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే కార్యక్రమానికి హాజరయ్యే ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. రెండు రోజులు నిర్వహించనున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల నుంచి వీసీలు, రిజిస్ట్రార్లు, ఇతర ప్రముఖులు మొత్తం 600 మంది అతిథులుగా హాజరుకానున్నారు. మొదటి రోజు ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనరసింహ హాజరుకాన్నారు. ముగింపు వేడుకలకు కేంద్రమంది కిషన్‌రెడ్డి రానున్నారు. కాగా.. రెండోరోజు ఉదయం 10 గంటలకు పీయూకు ఉషా, మేరు ప్రతినిధులు రానున్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో

పతకాలు సాధించాలి

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని అథ్లెటిక్స్‌ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్ర అన్నారు. హన్మకొండలో శుక్రవారం, శనివారాల్లో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లా అండర్‌–6, 8, 10, 12 ఏళ్ల లోపు బాలబాలికలు, కిడ్స్‌, జాతీయ జావెలిన్‌ డే సందర్భంగా అండర్‌–14, 16, 18, 20 బాలబాలికలు, పురుషుల, మహిళల జావెలిన్‌త్రో పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను గురువారం జిల్లా ప్రధాన కార్యదర్శి అభినందించారు. పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్‌లు ఆనంద్‌, సునీల్‌కుమార్‌, జిల్లా సంఘం సభ్యులు శ్రీనివాసులు, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement