నాగర్‌కర్నూల్: జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో జాప్యానికి తావివ్వొద్దని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భూసేకరణ పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పాలమూరు–రంగారెడ్డి, ఎంజీకేఎల్‌ఐ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అచ్చంపేట ఎత్తిపోతల పథకం, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అవార్డుల జారీ, రైతులకు పరిహారం చెల్లింపులు, పెండింగ్ కేసులు, వివాదాస్పద భూములు తదితర వివరాలను తెలుసుకున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పరిధిలో 51.10 ఎకరాల భూసేకరణ మాత్రమే పెండింగ్‌లో ఉందని అధికారులు వివరించారు. అచ్చంపేట ఎత్తిపోతల పరిధిలో సుమారు 2,588 ఎకరాల భూసేకరణ వివిధ దశల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎంజీకేఎల్‌ఐ పరిధిలో 200, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో 186 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉందని తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగాలని స్పష్టం చేశారు.
● కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో ప్రకటించే పీజీఐలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాలు, జిల్లాల పనితీరును సుమారు 70 కీలక సూచికల ఆధారంగా అంచనా వేసి ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ)లో జిల్లా 333 పాయింట్లతో రాష్ట్రంలో 9వ స్థానంలో ఉందని.. ఈ విద్యా సంవత్సరం తొలి స్థానంలో నిలిపేందుకు అధికారులు ప్రణాళికబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అరుణారెడ్డి, మాధవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు అశోక్, హర్షవర్ధన్, డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్, ఏఎంఓ కిరణ్‌కుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ నూరుద్దీన్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి మాధవరెడ్డి, వెంకటేశ్వర్లుశెట్టి ఉన్నారు.


