కందనూలు: నవోదయ విద్యాలయాలు ప్రతిభకు నిలయాలుగా నిలుస్తున్నాయని నాగర్‌కర్నూల్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గీతాంజలి అన్నారు. బుధవారం వట్టెం నవోదయ విద్యాలయం 41వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పూర్ణిమ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. తాను కూడా వట్టెం నవోదయ విద్యాలయంలోనే 6 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలు జాతికి అత్యుత్తమ పౌరులను అందించే నిలయాలుగా నిలిచాయని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ పూర్ణిమ మాట్లాడుతూ.. ప్రతి ఏటా 10–12 తరగతుల ఫలితాల్లో నవోదయ విద్యార్థులు టాపర్స్‌గా నిలవడం.. సివిల్ సర్వీసెస్, గ్రూప్ లాంటి పోటీ పరీక్షల్లో అత్యధికంగా నవోదయ విద్యార్థులు ఉండటం ఇందుకు నిదర్శనమని అన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.


