అచ్చంపేట/ అచ్చంపేట రూరల్/ అమ్రాబాద్/ మన్ననూర్: మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో చాలాచోట్ల పాఠశాలలు తెరుచుకోకపోవడంతో పేదలు విద్యకు దూరమవుతున్నారు. సోమవారం ఏజెన్సీ పాఠశాలలో నిర్వహించిన ‘సాక్షి’ విజిట్‌లో ఈ విషయాలు వెలుగు చూశాయి. గత రెండేళ్లుగా విద్యార్థులు లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. అన్ని పాఠశాలలు తెరిపించాలని ప్రభుత్వం భావించి ప్రత్యేకంగా బడిబాట కార్యక్రమం నిర్వహించింది. మూతబడిన పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించి బడిఈడు పిల్లలను గుర్తించి చేర్పించేలా చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించలేదు. జిల్లాలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో 67 బడులు మూతబడగా చాలా వరకు తెర్చుకోలేదు. అత్యధికంగా నల్లమలలోనే మూతబడిన పాఠశాలలు ఉన్నాయి. అచ్చంపేట మండలం ఐనోలు జెడ్పీహెచ్‌ఎస్ టీచర్ గుండూరు వెళ్లగా తిరిగి యథా స్థానానికి వచ్చారు. శివారుతండా, లింగరోనిపల్లి ఏజెన్సీ ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్‌లో వెళ్లగా కలెక్టర్ ఆదేశాల మేరకు తిరిగి వారి స్థానాల్లో విధుల్లో చేరారు. అయితే ఇప్పుడు మళ్లీ వీరిని తిరిగి ఏజెన్సీలోని ఇతర పాఠశాలలకు పంపించే దిశగా అధికారులు ప్రయత్నిస్తున్నారు.
నలమలలో విద్యకు దూరమవుతున్న గిరిజన విద్యార్థులు
ఏజెన్సీ ప్రాంతంలో చదువు చెప్పేందుకు ఉపాధ్యాయుల విముఖత
వివిధ రకాల కారణాలతో డిప్యూటేషన్లపై మైదాన ప్రాంతాలకు..
తాజాగా కలెక్టర్ ఆదేశాలతో
రద్దు చేసిన జిల్లా విద్యాశాఖ
రెండేళ్లుగా స్కూళ్లు మూత.. పిల్లలు ఉన్నచోటికి సర్దుబాటుకు ప్రయత్నాలు
సర్దుబాటు ఇలా..
బక్కలింగాయిపల్లి ఉపాధ్యాయుడు ఇన్ సర్వీస్ బీఎడ్ కోర్సు కోసం రెండేళ్లపాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో మర్లపాడుతండా పీఎస్ జీరోఎన్‌రోల్‌మెంట్ ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై పంపించారు. సిద్దాపూర్ పీఎస్‌లో ఇద్దరు టీచర్లకు ఒకరు మెడికల్ లీవ్‌లో ఉండగా.. దాస్యతండా టీచర్‌ను పంపించారు. ఎద్దుమిట్టతండాలో పనిచేస్తున్న టీచర్‌కు వార్డెన్ పోస్టు రావడంతో వెళ్లిపోయారు. 26 మంది పిల్లలున్న ఈ పాఠశాలకు దుబ్బాతండా టీచర్‌ను సర్దుబాటు చేశారు. చీన్యాతండా పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టు ఖాళీ కారణంగా 5 మంది విద్యార్థులు సిద్దాపూర్ పాఠశాలకు వస్తుండగా లింగరోనిపల్లి టీచర్‌ను పంపించేలా చూస్తున్నారు. పద్మారంతండాకు చెందిన విద్యార్థులు సమీపంలోని సిద్దాపూర్ వస్తుండగా పద్మారంతండాకు టీచర్ సర్దుబాటు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఘనపూర్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ ఇన్‌సర్వీస్ బీఎడ్ కోసం వెళ్లగా దన్యాలతండా టీచర్‌ను ఇక్కడికి పంపించారు.


