పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది | - | Sakshi
Sakshi News home page

పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది

Aug 4 2026 1:23 AM | Updated on Aug 4 2026 1:23 AM

కందనూలు: ఉద్యోగులకు పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుందని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సుధాకర్‌రెడ్డి ఏఎస్‌ఐగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ఎస్పీ చేతులమీదుగా సుధాకర్‌రెడ్డికి ఏఎస్‌ఐ హోదా స్టార్స్‌ అలంకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదోన్నతి అనేది కేవలం ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదగడమే కాకుండా.. బాధ్యతలు మరింత పెంచుతుందని గుర్తించాలన్నారు. పదోన్నతి పొందిన ప్రతి పోలీస్‌ సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ రాంలాల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 10 అర్జీలు

ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో బాధితుల నుంచి ఎస్పీ 10 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 7 భూమికి సంబంధించినవి, 3 తగు న్యాయం చేయాలని ఫిర్యాదులు వచ్చాయని, ఆయా ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి

గుణపాఠం చెప్పాలి

వెల్దండ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేస్తుందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. సోమవారం వెల్దండలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు. రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వానికి సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడంలో విఫలమైందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని విమర్శించారు. మరోవైపు ఎరువులకు కొత్త యాప్‌లను తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఫలితంగా యూరియా కోసం రైతులు తిప్పలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాంప్లెక్స్‌ ఎరువులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారని ఆరోపించారు. గత కేసీఆర్‌ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసినట్లు గుర్తుచేశారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజితారెడ్డి, నాయకులు ఐజాక్‌, నిరంజన్‌, లింగంముదిరాజ్‌, అంజినాయక్‌, ప్రసాద్‌, అంజిమాస్టర్‌, శ్రీను పాల్గొన్నారు.

434 మెగావాట్ల

విద్యుదుత్పత్తి

ఆత్మకూర్‌: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. సోమవారం 11 యూనిట్ల ద్వారా 44.925 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234, దిగువలో 5 యూనిట్లలో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేశారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ కేంద్రాల్లో 44.925 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టినట్లు ఎస్‌ఈ తెలిపారు.

రీజియన్‌కు 12 మంది అప్రెంటిస్‌ ఇంజినీర్లు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలోని పది డిపోలకు గాను 12 మంది శిక్షణ ఇంజినీర్‌ అప్రెంటిస్‌లను కేటాయించారు. ఇటీవల వీరు నియమితులు కాగా.. బుధవారం ఆయా డిపోలలో చేరనున్నారు. వీరికి మూడేళ్ల పాటు ఆర్టీసీ తరఫున స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నారు. మొదటి ఏడాదిలో నెలకు రూ.18 వేల చొప్పున, రెండో ఏడాదిలో రూ.20 వేల చొప్పున, మూడో ఏడాదిలో రూ.22 వేల చొప్పున పారితోషికం అందుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement