నాగర్‌కర్నూల్: ఓటరు డిజిటలైజేషన్ ప్రక్రియలో పొరపాట్లకు తావివ్వొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ ద్వారా ఎస్‌ఐఆర్ ప్రక్రియ, డిజిటలైజేషన్ పురోగతి, ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ అమలుపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరు పేరు నమోదు, పేర్ల తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పు, లింగం, వయస్సు, ఇతర వ్యక్తిగత వివరాల్లో మార్పులకు సంబంధించిన దరఖాస్తులను అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. బూత్ లెవల్ అధికారులు చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి డబుల్ ఎంట్రీలు, నకిలీ నమోదులు, సాంకేతిక లోపాలు లేదా సమాచారం నమోదు చేసే సమయంలో పొరపాట్లు జరగకుండా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా మాత్రమే నమోదు చేయాలని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను ఎన్నికల సిబ్బంది, బూత్ లెవల్ అధికారులు ఓటరు జాబితాలను పూర్తిస్థాయిలో తప్పులులేకుండా రూపొందించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చెన్నయ్య, ఆర్డీఓ అర్చన పాల్గొన్నారు.


