కందనూలు: కాంగ్రెస్ ప్రభుత్వం మాలలను నమ్మించి మోసం చేస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాలలను రాజకీయంగా వాడుకుంటుందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణతో మాల సామాజిక వర్గం పూర్తిగా తమ ఉనికి కోల్పోయిందన్నారు. ఈ వర్గీకరణను దేశంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని, దీనికి బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే.. మోదీ దేశమంతా విస్తరింపచేశారని మండిపడ్డారు. సామాజిక న్యాయం దళితులకు ఇచ్చే రిజర్వేషన్లలో మాత్రమేనా ఈ దేశ సంపదలో అక్కర్లేదా అని ప్రశ్నించారు. మోడీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో సామాజిక న్యాయం అక్కర్లేదా? మాల వర్గంపై కుట్ర చేస్తుంటే ఎన్నాళ్లు చూస్తు ఉండాలని వాపోయారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నామని వాపోయారు. చెంచా గిరికి అలవాటు పడ్డ కొందరు మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉంటూ.. జాతికి ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బీరం సతీష్‌కుమార్, కూన సుధాకర్, నూనె క్రాంతికుమార్, డా.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


