ఉప్పునుంతల: ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు పెంచడానికి వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ కృష్ణ అన్నారు. గురువారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌తోపాటు పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా సందర్శించి.. హాజరు రిజిష్టర్, ఇతర రికార్డులు, వివిధ వార్డులను పరిశీలించారు. ఆస్పత్రిల్లో జరుగుతున్న సాధారణ కాన్పుల వివరాలను తెలుసుకున్నారు. రోజువారిగా వస్తున్న బయటి రోగులతోపాటు ఇన్‌పేషెంట్లుగా ఉన్న రోగుల వివరాలను డాక్టర్ స్వప్నను అడిగి తెలుకున్నారు. సిబ్బంది సమయపాలన పాటించడంతోపాటు ముసురు వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే సబ్ సెంటర్లలోనూ వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు చికిత్స అందించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యులు బిక్కునాయక్, శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.


