రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

Jul 30 2026 5:06 AM | Updated on Jul 30 2026 5:06 AM

నాగర్‌కర్నూల్‌/కందనూలు: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రహదారులపై ఆక్రమణలు, అధిక వేగం, ట్రాఫిక్‌ నియమాలపై నిర్లక్ష్యం, అవగాహన లోపం వంటి కారణాలతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని.. వాటి నివారణకు దీర్ఘకాలిక కార్యాచరణతో పాటు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రెండు జాతీయ రహదారులు కలిగిన కల్వకుర్తి ప్రాంతంలో రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా దిశానిర్దేశిత బోర్డులు, హెచ్చరిక సూచికలు, ప్రతిబింబించే సైన్‌ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదకర జంక్షన్ల వద్ద బ్లింకర్‌ లైట్లు ఏర్పాటుచేసి, వాహనదారులను అప్రమత్తంచేసే చర్యలు చేపట్టాలని తెలిపారు. స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆర్టీఓను కలెక్టర్‌ ఆదేశించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దన్నారు. ముఖ్యంగా 8, 9, 10 తరగతి విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. అచ్చంపేటలో ప్రతి శనివారం నిర్వహించే సంతతో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయని.. సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోని చెంచు, గిరిజన కుటుంబాలకు ఆధార్‌ కార్డులు అందించాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ ఆధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ చెన్నయ్యతో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని లింగాల, అమ్రాబాద్‌, పదర, బల్మూర్‌, అచ్చంపేట మండలాల పరిధిలోని చెంచు గూడాలు, గిరిజన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి.. ఆధార్‌ నమోదు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం గ్రామాల వారీగా కార్యాచరణ రూపొందించి, ముందస్తు సమాచారంతో ప్రతి కుటుంబాన్ని నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఆయా మండలాల పరిధిలో పనిచేస్తున్న బ్యాంకులు తప్పనిసరిగా ఆధార్‌ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేసి, గిరిజనులకు సేవలు అందించాలని ఎల్‌డీఎం చంద్రశేఖర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఆధార్‌ కార్డు అందించడం ద్వారా రేషన్‌, పింఛన్లు, విద్యా పథకాలు, ఆరోగ్య సేవలు, ఉపాధి హామీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు ఎలాంటి ఆటంకం లేకుండా అందుతాయని.. ఇందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చెన్నయ్య, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఆర్వో పాండు, డీఈఓ రమేశ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement