కందనూలు: విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నరేశ్‌ఆచారి డిమాండ్ చేశారు. ఫీజు ల బకాయి.. బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా బుధవారం పాలెం డిగ్రీ కళాశాలలో విద్యార్థులచే సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను అందించకపోవడంతో చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో విద్యార్థినులకు స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు అందిస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. పేద విద్యార్థుల చదువుపై నిర్లక్ష్యపు ధోరణి అవలంబిస్తే పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, యువమోర్చా నాయకులు విజేందర్‌రెడ్డి, నిశ్వంత్, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ వైభోగం..
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధ వారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన పల్లకిలో స్వామి దంపతులను గర్బగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలతో కల్యాణం వేడుకను జరిపించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి పల్లకిలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరిరామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
చేపల సంరక్షణపై
అవగాహన
అమరచింత (ఆత్మకూర్): చేపపిల్లల పెంపకందారులు సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు ఖమ్మం జిల్లా శాస్త్రవేత్తలు షిగా నాగరాజు, బానోత్ దివ్య సూచించారు. బుధవారం ఆత్మకూర్ మండలం ఆరేపల్లిలో ఏటి ఆనంద్ చేపల ఫారంను వారు సందర్శించి మత్స్యకారులకు అవగాహన కల్పించారు. చేపల్లో సాధారణంగా కనిపించే వ్యాధుల లక్షణాలు, నివారణ పద్ధతులు, నీటి నాణ్యత నిర్వహణ, బయో సెక్యూరిటీ చర్యల గురించి వివరించారు.


