పైసలిస్తే చకచకా పనులు! | - | Sakshi
Sakshi News home page

పైసలిస్తే చకచకా పనులు!

Jul 30 2026 5:06 AM | Updated on Jul 30 2026 5:06 AM

కల్వకుర్తి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల హవా

రూ.20 వేలిస్తే క్షణాల్లో రిజిస్ట్రేషన్‌

కల్వకుర్తి టౌన్‌: స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల హవా కొనసాగుతోంది. అధికారుల వద్దకు నేరుగా వెళ్తే సవాలక్ష నిబంధనలతో రిజిస్ట్రేషన్లు కుదరని చెప్పడం.. ప్రైవేటు వ్యక్తి ద్వారా వెళ్తే ఠక్కున పనులు చేయడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి బాధితుల వివరాల మేరకు.. వెల్దండ శివారులోని సర్వేనం.707లోని 19.13 ఎకరాల భూమిలో వెంచర్‌ ఏర్పాటు చేయగా.. అదే మండలానికి చెందిన మట్ట నాగేశ్వర్‌గౌడ్‌, పందెం కృష్ణారెడ్డి ప్లాట్లు కొనుగోలు చేశారు. భూమికి సంబంధించిన న్యాయ వివాదం పరిష్కారమైన అనంతరం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పది రోజుల వ్యవధిలో 8మంది ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మంగళవారం కృష్ణారెడ్డి తన ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయానికి వెళ్లగా.. రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదని ప్రధాన అధికారి చెప్పారు. అతడు నిరాశతో బయటకు వస్తుండగా.. కార్యాలయంలో తిరిగే ఓ ప్రైవేటు వ్యక్తి తనను కలిసి రూ.20 వేలు ఇస్తే పని పూర్తిచేయిస్తానని చెప్పాడు. అత్యవసర పరిస్థితుల్లో అతను చెప్పినట్లే ఫోన్‌ పే ద్వారా డబ్బులు పంపించగా.. కొద్ది సేపటికే నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. అయితే బుధవారం అదే సర్వే నంబర్‌లోని మరో ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన నాగేశ్వర్‌గౌడ్‌కు మాత్రం అధికారులు రిజిస్ట్రేషన్‌ సాధ్యం కాదని చెప్పారు. 24 గంటలు కూడా గడవకముందే నిబంధనలు ఎలా మారాయని.. ఒకరికి చేసిన పని మరొకరికి ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం.. డబ్బులు డిమాండ్‌ చేయడం పరిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement