● మెట్ట పంటలకు జీవం
● ఆనందంలో ఆన్నదాతలు
కందనూలు: జిల్లావ్యాప్తంగా బుధవారం మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కురిసిన వర్షంతో మెట్ట పంటలకు జీవం పోసినట్లయింది. కొన్ని రోజులుగా వర్షాభావంతో ఆందోళనలో ఉన్న అన్నదాతల్లో సాగు ఆశలు చిగురించాయి. తిమ్మాజిపేటలో అత్యధికంగా 31.0 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. జిల్లా కేంద్రంలో అత్యల్పంగా 16.8 మి.మీ. వర్షం కురిసింది. బిజినేపల్లిలో 30.3 మి.మీ., నాగర్‌కర్నూల్ మండలంలో 29.3 మి.మీ., బల్మూరులో 25.8 మి.మీ., కల్వకుర్తి మండలంలో 20.5 మి.మీ., వర్షపాతం నమోదైంది. మోస్తరు వర్షంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. ఆయా ప్రాంతాల్లో సాగుచేసిన జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి తదితర పంటలకు కొంత మేలు చేసింది. ఇటీవల వర్షాలు కురువక మొక్కల ఎదుగుదల మందగించడంతో పాటు పలుచోట్ల వాడిపోతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా కురిసిన వర్షంతో భూమిలో తేమశాతం పెరిగి పంటలు కోలుకునే అవకాశాలు మెరుగుపడ్డాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు, మూడురోజులు ఇదే తరహాలో వర్షాలు కురిస్తే సాగు పూర్తిగా గాడిన పడుతుందని భావిస్తున్నారు.


