క్షయ నిర్మూలన దిశగా..
● జిల్లాలో వ్యాధి నియంత్రణకు చర్యలు
● గ్రామాల్లోనే అదునాతన యంత్రాలతో స్క్రీనింగ్
● వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ
అనుమానితులకు పరీక్షలు..
క్షయవ్యాధి నివారణ కోసం జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి చేయడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో వైద్య సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అదే విధంగా క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిబిరాలను నిర్వహిస్తున్నాం. అనుమానితులకు పరీక్షలు నిర్వహించి.. లక్షణాలు ఉన్నవారికి ఉచితంగా మందులు అందిస్తున్నాం.
– డా.రవికుమార్, డీఎంహెచ్‌ఓ
పోషకాహార లోపం లేకుండా..
జిల్లాలోని క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార లోపం లేకుండా ఎస్‌బీఐ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న భవిష్య భారత్ సంస్థ ద్వారా పోషకాహార కిట్లు అందజేస్తున్నాం. క్షయ వ్యాధిగ్రస్తులకు తమవంతు సహకారం అందిస్తూ.. వ్యాధి నివారణకు కృషి చేస్తున్నాం.
– సజ్జద్ అలీ, భవిష్య భారత్ సంస్థ జిల్లా మేనేజర్
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో క్షయవ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. వ్యాధిగ్రస్తులు సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల తీవ్రత పెరిగిపోవడంతో పాటు ఇతరులకు సంక్రమిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా క్షయ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించి.. వారికి సకాలంలో చికిత్స అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులను అందజేయడంతో పాటు పోషకాహార లోపం ఉండకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘నిక్షయ మిత్ర’ కార్యక్రమం ద్వారా పోషకాహార కిట్లు అందజేస్తోంది.
ముమ్మరంగా అవగాహన..
క్షయవ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యసిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి.. అనుమానితులను గుర్తించడంతో పాటు అత్యాధునిక యంత్రాలతో పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారితో పాటు దీర్ఘకాలంగా సిగరేట్, మద్యం తాగే వారి కుటుంబసభ్యులు, ఎయిడ్స్ బాధితులకు స్క్రీనింగ్ నిర్వహించి.. వ్యాధి లక్షణాలు ఉన్న వారికి తెమడ పరీక్షలు చేస్తున్నారు.
జిల్లాలో 734 మంది వ్యాధిగ్రస్తులు..
జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో 734 మంది క్షయ వ్యాధిగ్రస్తులను అధికారులు గుర్తించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది పర్యవేక్షించడంతో పాటు అవసరమైన మందులు అందిస్తూ.. వ్యాధి నివారణకు కృషి చేస్తున్నారు. అదే విధంగా వివరాలను నిక్షయ్ పోర్టల్‌లో నమో దు చేస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి అపోలో, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ పరిధిలోని వ్యాధిగ్రస్తులకు ఎస్‌బీఐ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న భవిష్య భారత్ సంస్థ ద్వారా పోషకాహార కిట్లు అందిస్తున్నారు. పోషకా హార కిట్లలో బియ్యం, కందిపప్పు, పల్లీలు, బెల్లం, ప్రోటీన్ పౌడర్ తదితర బలమైన ఆహార పదార్థాలు ఉంటాయి. జిల్లాలో క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని.. వ్యాది లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
క్షయ నిర్మూలన దిశగా..
క్షయ నిర్మూలన దిశగా..


