ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం మొత్తం 33 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. 3,144 మంది విద్యార్థులకు గాను 3,006 మంది హాజరయ్యారు. ప్రాక్టికల్స్ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అండగా నిలవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి అన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వ్యాధి క్యాన్సర్ అని అన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి మద్దతుగా ఉండటంతో పాటు మానసిక ధైర్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని.. తద్వారా సరైన వైద్యం అందించి వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్, ఆర్‌ఎంఓ డా.రవిశంకర్, గైనకాలజిస్ట్ డా.సుప్రియ, డా.అతిథి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.భరత్‌కుమార్ రెడ్డి, పాలియేటివ్ కేర్ మెడికల్ ఆఫీసర్ డా.మౌనిక తదితరులు పాల్గొన్నారు.
అసమానతలు లేని సమాజాన్ని నిర్మిద్దాం
కందనూలు: వివక్ష, అసమానతలు లేని సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ కార్యాలయంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం న్యాయ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏఓ జగదీశ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు
దరఖాస్తు చేసుకోండి
కందనూలు: ఎస్సీ, స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సు శిక్షణకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులకు మార్చి 1న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న వారికి 5 నెలల ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి, స్టడీ మెటీరియల్ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
సెమీస్‌కు పాలమూరు మహిళల జట్టు
మహబూబ్‌నగర్ క్రీడలు: వరంగల్‌లో జరుగుతున్న సీనియర్ ఉమెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 టోర్నమెంట్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మహిళా జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకొని సెమీఫైనల్‌కు చేరింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు 10 వికెట్ల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 90 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. మహబూబ్‌నగర్ బౌలర్లు అనిత, మేఘన చెరో రెండేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్ 10.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. జట్టులో అక్షర రాథోడ్ (46 నాటౌట్), ఆర్యాని (25 నాటౌట్)గా నిలిచారు.ఈనెల 6వ తేదీన మహబూబ్‌నగర్ జట్టు సెమీఫైనల్‌లో ఖమ్మం జట్టుతో తలపడనుంది.
ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్
ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్


