కమలంలో కొత్త జోష్‌ | - | Sakshi
Sakshi News home page

కమలంలో కొత్త జోష్‌

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

కమలంల

కమలంలో కొత్త జోష్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/పాలమూరు: కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల ముందు కమల దళపతి రాకతో బీజేపీ శ్రేణుల్లో నూతన జోష్‌ వచ్చింది. మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనం కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగంతో కమల దళంలో ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలలో ఉండే బూత్‌ స్థాయి కార్యకర్తలు, వివిధ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, ఎన్నికల్లో పోటీ కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతిసి.. ఒక వర్గాన్ని సంతృప్తి పర్చేందుకు కాంగ్రెస్‌ చేస్తున్న కుటిల రాజకీయాలను గమనించాలన్నారు. తెలంగాణలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని మండిపడ్డారు.

అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌

‘తెలంగాణలో ఎన్నికల ముందు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మహిళలనే కాదు.. రైతులను, బడుగు, బలహీన వర్గాలు, ఓబీసీలనూ మోసం చేసింది. రైతు భరోసా కింద రూ.15 వేలు, రుణమాఫీ, భూమి లేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి దగా చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఆదివాసీలు ఇలా అన్ని వర్గాల వారిని నమ్మించి నట్టేట ముంచింది. మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పినా.. ఇంత వరకు ఇవ్వడం లేదు. కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసానికి పాల్పడింది. పదేళ్లు అధికారంలో ఉన్న అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఇదే మార్గాన్ని అవలంబించి ప్రజాగ్రహానికి గురైంది. తెలంగాణలో అన్ని వర్గాలకూ న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. మోదీకి తెలంగాణ ప్రజలపై చిత్తశుద్ధి ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ లో తెలంగాణకు నిధులు మంజూరు చేసినా.. ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు కావాలని విమర్శిస్తున్నారు. రైల్వేరంగంలో హై స్పీడ్‌ కారిడార్‌, హైదరాబాద్‌–పుణె, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–చైన్నె రోడ్డు కారిడార్‌ మంజూరు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో తెలంగాణకు రూ.5,450 కోట్లు కేటాయించాం. యువ నాయకత్వం బీజేపీకి అండగా నిలుస్తోంది. బీజేపీ, మోదీ నాయకత్వాన్ని కోరుకుంటూ ప్రతి నగరం నుంచి ఎన్నికల కోసం పని చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పోరాటం అధికారం కోసమో, కుర్చీ కోసం కాదు. తెలంగాణ గౌరవం కోసం. ఈ రాష్ట్ర భవిష్యత్‌ కోసం మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలాన్ని గెలిపించుకోవాలి.’ అని నితిన్‌ నబిన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశిష్‌ షెలాన్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, గౌతమ్‌రావు, నాయకులు పోతుగంటి రాములు, గువ్వల బాలరాజు, ఆచారి, భరత్‌, చికోటి ప్రవీణ్‌, కట్టా సుధాకర్‌రెడ్డి, నాగురావు నామాజీ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

పాలమూరు గడ్డ.. బీజేపీకి అడ్డా: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ పార్టీకి అడ్డాగా నిలువబోతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇక్కడి నుంచే మున్సిపల్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో తెలంగాణ పోరుయాత్రను సైతం పాలమూరులోని మక్తల్‌ నుంచే ప్రారంభించామని గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇక్కడకు వచ్చారన్నారు. నారాయణపేట మున్సిపాలిటీలో ఏళ్లుగా చైర్మన్‌ స్థానాన్ని కై వసం చేసుకుంటూనే ఉన్నామని చెప్పారు. మక్తల్‌, ఆమనగల్‌ చైర్మన్‌ స్థానాలను గతంలోనే దక్కించుకున్నామన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా తాము పాలమూరులో ఎంపీ సీటును గెలిచామని చెప్పారు. ఎవరితో పొత్తులు, అండ లేకుండానే ఒంటరిగా విజయాలను సాధించగలిగామని.. రానున్న రోజుల్లో పాలమూరు బీజేపీకి అడ్డాగా మారబోతుందని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పాలమూరు గడ్డపై బీజేపీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలను నెరవేర్చలేక పోయారని విమర్శించారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, దళిత, బీసీ వర్గాలకు ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ కాలంలోనూ పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇరుపార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు.

పాలమూరుకు ఇప్పటికీ అన్యాయమే: రాంచందర్‌రావు

ఇక్కడి నుంచి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినా పాలమూరు జిల్లాకు అన్యాయమే జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. రెండేళ్లలో సీఎం ఇక్కడి ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఆలయాలను ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో హోంమంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నా లా అండ్‌ ఆర్డర్‌ అదుపులో లేదని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. కేంద్ర నిధులతో మున్సిపాలిటీల అభివృద్ధి బాధ్యత బీజేపీ తీసుకుంటుందని ఆయన చెప్పారు.

మున్సిపల్‌ ఎన్నికల శంఖారావం మోగించిన బీజేపీ

భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు

దిశానిర్దేశం చేసిన జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ సిన్హా

తెలంగాణ గౌరవం కోసమే బీజేపీ పోరాటం

రాష్ట్ర భవిష్యత్‌ కోసం మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించండి

కమలంలో కొత్త జోష్‌1
1/3

కమలంలో కొత్త జోష్‌

కమలంలో కొత్త జోష్‌2
2/3

కమలంలో కొత్త జోష్‌

కమలంలో కొత్త జోష్‌3
3/3

కమలంలో కొత్త జోష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement