సులభంగా వాహన రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

సులభంగా వాహన రిజిస్ట్రేషన్‌

Feb 6 2026 8:57 AM | Updated on Feb 6 2026 8:57 AM

సులభం

సులభంగా వాహన రిజిస్ట్రేషన్‌

అచ్చంపేట: కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం ఇకపై ఆర్డీఏ కార్యాలయానికి వెళ్లి వేచి చూడాల్సిన పనిలేదు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌(టీఆర్‌) లాగే.. శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చే బాధ్యతలను ప్రభుత్వం షోరూం డీలర్లకు అప్పగించింది. ఇందుకోసం రవాణా శాఖ అన్ని ఏర్పాట్లు చేయగా.. జిల్లావ్యాప్తంగా ఈ నూతన ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. ద్విచక్రవాహనాలు, కార్లకు మాత్రమే షోరూంల్లో శాశ్వత రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు ఆర్టీఏ కార్యాలయాల్లోనే చేయించుకోవాలి. ప్రభుత్వ నిర్ణయంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సేవలందించే ఆవకాశం ఉంటుంది. అయితే ఇటీవలే ప్రభుత్వం రోడ్డు భద్రత పేరుతో ప్రత్యేక సెస్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, కార్లకు రూ.5 వేలకుపైగా చెల్లించాలి. వాహన కొనుగోలు సమయంలోనే సెస్‌ చెల్లించాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్‌ ఇలా..

కొత్త వాహనం తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లడం కోసం చాలామంది వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్‌ చేయించుకునే కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. షోరూంలో వినియోగదారులు వాహనం కొన్న వెంటనే టీఆర్‌ (తాత్కాలిక రిజిస్ట్రేషన్‌)నంబర్‌ నమోదు చేస్తారు. తర్వాత షోరూం వారే రవాణా శాఖ వాహన్‌ పోర్టల్‌ టీఆర్‌ సంఖ్య, ధర (ఇన్‌వాయిస్‌) ఛాసిస్‌ నంబరు, వాహనం ఫొటో, బీమా పత్రం, అడ్రస్‌ ప్రూఫ్‌, వినియోగదారుడి ఫొటో, దరఖాస్తుదారుడి వివరాలు అప్‌లోడ్‌ చేస్తారు. వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాల హార్డు కాపీని షోరూం ప్రతినిధులు రవాణా శాఖ కార్యాలయానికి పంపిస్తారు. వాటి పరిశీలన అనంతరం అధికారులు వాహన నంబర్‌ను కేటాయిస్తారు. దీంతో రిజిస్ట్రేషన్‌ కార్డు (ఆర్సీ) జనరేట్‌ అవుతుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన విషయం సంక్షిప్త సమాచారం (ఎస్‌ఎంఎస్‌) రూపంలో వాహనదారుడు, షోరూంలకు చేరుతుంది. సంబంధిత ఆర్సీ కార్డును లైసెన్స్‌డ్‌ డీలర్‌ ద్వారా షోరూంకు స్పీడ్‌ పోస్టు ద్వారా చేరుతుంది. అక్కడి నుంచి వాహనదారులు ఈ కార్డు తీసుకుంటారు.

ఫ్యాన్సీ నంబర్‌కు..

ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనానికి కోరుకున్న లేదా ఫ్యాన్సీ నంబర్‌ కావాలంటే తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తోపాటు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అదనపు రుసుం చెల్లిస్తే కావాల్సిన సంఖ్యను రవాణా శాఖ అధికారులు కేటాయిస్తారు. ఇందుకోసం కొంత సమయం పట్టనుండగా.. అప్పటి వరకు ఆగాల్సి వస్తుంది.

జిల్లాలో 24 షోరూంలు

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో వివిధ కంపెనీలకు సంబంధించిన ద్విచక్రవాహన షోరూంలు 20, కార్ల షోరూంలు 4 ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌, బిజినేపల్లి పరిధిలో రోజుకు 10 నుంచి 20 ద్విచక్రవాహనాలు, 2 నుంచి 4 వరకు కార్లు, ఇతర వాహనాలు అమ్ముడవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాహనానికి సంబంధించి అన్ని లావాదేవీలు షోరూం డీలరు ముందే వసూలు చేసేవారు. వాహనానికి సంబంధించి తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ పత్రం మాత్రమే ఇచ్చేవారు. ఆ పత్రాలు తీసుకుని రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇందుకోసం రవాణా ఖర్చులు, సమయం వృథా అయ్యేది. ముఖ్యంగా మధ్యవర్తుల ప్రమేయం మరీ ఎక్కువగా ఉండేది. ఇకపై ఆ సమస్య తీరనుంది.

ఇకపై డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

కార్లు, ద్విచక్రవాహనాలకు

మాత్రమే అవకాశం

వినియోగదారులకు డబ్బు, సమయం ఆదా

ఆర్టీఏ అధికారులకు తగ్గనున్న పనిభారం

తప్పనున్న మధ్యవర్తుల బెడద

ప్రక్రియ ప్రారంభమైంది

షోరూంలలో నూతన వాహన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ గత నెల 24 నుంచే ప్రారంభమైంది. టీఆర్‌ సంఖ్య వచ్చిన సాయంత్రానికే వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్‌ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సేవలు అందుతాయి. తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం అవసరమైన అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. మా కార్యాలయంలో అన్ని పత్రాలు పరిశీలించి ఆమోదం తెలుపుతాం.

–చిన్నబాలు, జిల్లా రవాణా అధికారి

సులభంగా వాహన రిజిస్ట్రేషన్‌1
1/1

సులభంగా వాహన రిజిస్ట్రేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement