65 వార్డులు.. 521 నామినేషన్లు
ముగిసిన నామినేషన్ల దాఖలు పర్వం
● అత్యధికంగా నాగర్‌కర్నూల్‌లో 224.. అత్యల్పంగా కొల్లాపూర్‌లో 145
● చివరిరోజు పోటెత్తిన అభ్యర్థులు
● బీఫారాలపై వీడని ఉత్కంఠ
సాక్షి, నాగర్‌కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం ఆఖరు రోజున నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు పోటెత్తారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో 65 వార్డులకు గాను మొత్తం 521 నామినేషన్లు రాగా.. చివరి రోజున 312 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 224, కల్వకుర్తిలో 152, కొల్లాపూర్ మున్సిపాలిటీలో 145 నామినేషన్లు వచ్చాయి. మొత్తం నామినేషన్లలో కాంగ్రెస్ తరపున 148, బీఆర్‌ఎస్ 131, బీజేపీ 71, ఇతర పార్టీలు 18, ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి 70 నామినేషన్లు దాఖలయ్యాయి.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసినా పార్టీల అభ్యర్థిత్వంపై స్పష్టత కరువైంది. ఇప్పటి వరకు పార్టీల బీఫారాలు ఇవ్వకపోవడంతో ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలో పలుచోట్ల ఇద్దరు చొప్పున నామినేషన్లు వేశారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని ఆరో వార్డులో కాంగ్రెస్ తరపున తైలి శ్రీనివాసులుతోపాటు మరో అభ్యర్థి శ్రీను సైతం నామినేషన్ వేశారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నామినేషన్లు వేయడంతో చివరకు బీఫారం ఎవరికి దక్కుతుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్‌లో పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కాకపోయినా ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేశారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో రిజర్వ్‌డ్ స్థానాలతోపాటు పలుచోట్ల ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి వర్గీయులు, ఎంపీ మల్లు రవి వర్గీయులు టికెట్ల కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కాకున్నా ఎవరి వారు నామినేషన్లు సైతం దాఖలు చేశారు. బీఫారం ఇచ్చే క్రమంలో గ్రూప్ రాజకీయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. టికెట్టు దక్కకపోతే రెబల్‌గానైనా బరిలో ఉండేందుకు కసరత్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టికెట్టు దక్కని వారిని బుజ్జగించి నామినేషన్ ఉపసంహరింపజేయడం ముఖ్య నేతలకు ఇబ్బందికరంగా ఉండనుంది.
జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిర్వహించనుండగా, ఈసారి మిగతా మున్సిపాలిటీలకు భిన్నంగా కల్వకుర్తిలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉండనుంది. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లో బీజేపీ నుంచి నామమాత్రపు పోటీ ఉండగా, కల్వకుర్తిలో మాత్రం బీజేపీ తరపున అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరపున 71, బీఆర్‌ఎస్ 59 నామినేషన్లు రాగా, బీజేపీ నుంచి 8 మాత్రమే నామినేషన్లు వచ్చాయి. కొల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 27, బీఆర్‌ఎస్ 32, బీజేపీ 24 నామినేషన్లు వచ్చాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ 50, బీఆర్‌ఎస్ 40, బీజేపీ తరపున 39 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఒకే పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు పోటీలో ఉండటం, ఇప్పటి వరకు పార్టీల అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులకు నచ్చజెప్పేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే నామినేషన్లను దాఖలు చేయగా ఉపసంహకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ బీఫారం ఇచ్చాక పెద్దఎత్తున అసమ్మతి చెలరేగకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా ఫిబ్రవరి 2 వరకు బీఫారాలు అందించిన అభ్యర్థులకు పార్టీ గుర్తులను కేటాయిస్తారు. మిగతా వారికి ఇండిపెండెంట్ గుర్తులు కేటాయించనున్నారు. పార్టీ నుంచి బీఫారాలు దక్కకపోయినా ఇండిపెండెంట్‌గా సైతం బరిలో ఉండేందుకు ఎక్కువ మంది సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకే పార్టీకి చెందినవారు పోటీలో ఉంటే ఓట్ల చీలకతో ముప్పు వస్తుందని పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో
నామినేషన్ వేస్తున్న ఓ అభ్యర్థి
మున్సిపాలిటీ చివరిరోజు మొత్తం
వచ్చినవి
నాగర్‌కర్నూల్ 139 224
కల్వకుర్తి 81 152
కొల్లాపూర్ 92 145


