మాటలు కాదు.. చేతల్లో చూపాలి | - | Sakshi
Sakshi News home page

మాటలు కాదు.. చేతల్లో చూపాలి

Feb 9 2026 8:07 AM | Updated on Feb 9 2026 8:45 AM

మాటలు

మాటలు కాదు.. చేతల్లో చూపాలి

విజన్‌ ఉన్న నాయకులనే ఎన్నుకోవాలి

అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి

డ్రెయినేజీ, పారిశుద్ధ్యం మెరుగుపర్చాలి

సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

‘సాక్షి’ చర్చావేదికలో కందనూలువాసుల మనోగతం

బస్టాండ్‌

విస్తరించాలి..

జిల్లాకేంద్రంలో సుమారు 30 ఏళ్ల కిందటి బస్డాండ్‌ భవనమే ఇప్పటికీ కొనసాగుతోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా బస్టాండ్‌ విస్తరణ చేపట్టాలి. చినుకు పడితే చాలు పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. టెలిఫోన్‌ ఎక్స్ఛేంజీతోపాటు పలుచోట్ల రోడ్లపైనే నీరు నిలుస్తోంది. ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపాలి.

– తిరుపతయ్య, రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగి

ప్రలోభాలకు

లొంగకూడదు..

ఎన్నికల్లో హామీలకే పరిమితమయ్యే వారు కాకుండా చేతల్లో పనులు చేసి చూపగలిగే వారినే ఎన్నుకోవాలి. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను పట్టించుకునేవారు కావాలి. కేవలం ఎన్నికల సమయంలో నోటు, మద్యం, ఇతర ప్రలోభాలకు లొంగకూడదు. అభివృద్ధి చేసే నాయకులనే ఎన్నుకోవాలి.

– వెంకటస్వామి, రిటైర్డ్‌ ఉద్యోగి

రోడ్ల నిర్మాణం చేపట్టాలి..

పట్టణంలో ప్రధానంగా సీసీరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం పూర్తిస్థాయిలో చేపట్టాల్సి ఉంది. శివారు గ్రామాలతోపాటు చాలా వార్డుల్లో సీసీరోడ్లు, డ్రెయినేజీలు లేవు. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మించినా మురుగు బయటకు పంపేందుకు పంపింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుకాలేదు. ప్రధాన సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలి.

– పడిగె తిరుపతయ్య, నాగర్‌కర్నూల్‌

డంపింగ్‌ యార్డు సమస్య

జిల్లాకేంద్రంలో ప్రధానంగా డంపింగ్‌యార్డుతోపాటు అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ సమస్యలను పరిష్కరించాలి. పట్టణం నుంచి మురుగు బయటకు వెళ్లే మార్గం లేక కేసరిసముద్రం చెరువులో కలుస్తోంది. నాలాలు ఆక్రమణకు గురికావడంతో వర్షపు నీరు రోడ్లపైకి, ఇళ్లలోకి చేరుతోంది. చందాయిపల్లి శివారులో రైతులకు చెందిన భూముల్లో చెత్త డంపింగ్‌ యార్డు నిర్వహిస్తున్నారు. – వావిలాల రాజశేఖరశర్మ, నాగర్‌కర్నూల్‌

ఇళ్లలోకి వర్షపు నీరు..

వర్షం పడితే జిల్లాకేంద్రంలో రాంనగర్‌కాలనీతోపాటు ఇళ్లలోకే నీరంతా చేరుతోంది. డ్రెయినేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో చేపట్టాల్సి ఉంది. బస్టాండ్‌, ప్రధాన చౌరస్తాల వద్ద ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించాలి. ఎన్నికల్లో సరైన వ్యక్తులనే నాయకులుగా ఎన్నుకోవాలి. సేవాభావం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలి.

– లక్ష్మణ్‌నాయక్‌, టీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

బస్టాండ్‌ ఎదుటే దుర్గంధం

జిల్లాకేంద్రంలో బస్టాండ్‌ ఎదుటే తీవ్రమైన పారిశుద్ధ్య సమస్య నెలకొంది. బస్టాండ్‌ చుట్టూ బహిరంగ మూత్రవిసర్జన చేయడంతో దుర్గంధం వస్తుంది. టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా లేదు. పెరిగిన ట్రాఫిక్‌, జనాభాకు అనుగుణంగా బస్టాండ్‌ సరిపోవడం లేదు. మహిళలు, ప్రయాణికులకు సరైన షెల్టర్‌ సౌకర్యం కల్పించాలి.

– లక్ష్మణస్వామి, నాగర్‌కర్నూల్‌

సాక్షి, నాగర్‌కర్నూల్‌/ కందనూలు/ నాగర్‌కర్నూల్‌ రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే వారినే ఎన్నుకోవాలని పలువురు ఓటర్లు అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ మైదానంలో ఆదివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో పట్టణ సమస్యలపై నిర్వహించిన చర్చావేదిక కార్యక్రమంలో హాజరై మాట్లాడారు. నాగర్‌కర్నూల్‌ పట్టణంలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే నాయకులనే ఎన్నుకుంటామని తెలిపారు. మాటల్లో కాదు.. చేతల్లో పనులను చూపే నాయకులను ఎన్నుకోవాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం, డ్రెయినేజీల సమస్యలను తీర్చడంతోపాటు కోతులు, కుక్కల బెడదకు సైతం పరిష్కారం చూపాలని కోరారు.

లో ఓల్టేజీ సమస్య..

జిల్లాకేంద్రంలో పలుకాలనీల్లో విద్యుత్‌ లో ఓల్టేజీతో తరచుగా సమస్య నెలకొంది. ఇళ్లలోని టీవీలు, ఫ్రిడ్జ్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు పాడవుతున్నాయి. మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్‌ ఉన్నా నీటి సరఫరా ఉండటం లేదు. సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలి. సమస్యలకు పరిష్కారం చూపేవారిని ఎన్నుకోవాలి. – గుడిపల్లి నిరంజన్‌, టీచర్‌

సమస్యలపై దృష్టిపెట్టాలి..

ఓటరు జాబితాలో ఇష్టానుసారంగా పేర్ల మార్పులు జరిగాయి. ఒకవార్డు ఓటర్లను మరో వార్డులో చేర్చారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిపెట్టాలి. చెత్త సేకరణ నిత్యం కొనసాగాలి. కొన్నిచోట్ల రెండు, మూడు రోజులకు ఒకసారి చెత్త సేకరణ జరుగుతోంది. డంపింగ్‌ యార్డు నిర్వహణ సక్రమంగా చేపట్టాలి. – మురళీధర్‌రావు, వ్యాపారి

రోడ్లన్నీ గుంతలమయం..

జిల్లాకేంద్రంలోని బీసీకాలనీలో రోడ్లన్నీ గుంతలుగా మారాయి. వర్షం వస్తే చాలు అడుగు వేసే పరిస్థితి లేదు. ఇప్పటివరకు సీసీరోడ్లు నిర్మించలేదు. డ్రెయినేజీలు ఏర్పాటుకాలేదు. పరిస్థితి అధ్వానంగా ఉంది. రోడ్లు, డ్రెయినేజీలతోపాటు అభివృద్ధి చేసే నాయకులనే ఎన్నుకోవాలి. – బ్రహ్మచారి, వ్యాపారి

కుక్కల బెడద నివారించాలి..

జిల్లాకేంద్రంలో కుక్కలు, పందుల బెడద ఎక్కువగా ఉంది. కన్యకాపరమేశ్వరి ఆలయ సమీపంలోనే చెత్త డంపింగ్‌ యార్డు ఉండటంతో సమస్య ఉంది. అక్కడి నుంచి తరలించాలి. చెత్త సేకరణ సక్రమంగా ఉండేలా చూడాలి. బాధ్యత గల వారినే నాయకులుగా ఎన్నుకోవాలి.

– నర్సింహ, వ్యాపారి

మినీ స్టేడియం నిర్మించాలి..

జిల్లాకేంద్రంలో ఇండోర్‌ గేమ్స్‌ ఆడుకోవడానికి మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి. క్రీడల ప్రోత్సాహానికి వసతులు మెరుగుపర్చాలి. రోడ్ల మీదే చెత్తవేయడంతో పారిశుద్ధ్యం సక్రమంగా లేదు. పదవుల కోసం పాకులాడే వారిని కాకుండా ప్రజల కోసం పోరాటం చేసేవారినే ఎన్నుకోవాలి. – సాయిబాబు, లెక్చరర్‌

ప్రజాసేవే ముఖ్యం..

పట్టణంలో ఏళ్లుగా నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలి. ఈ రోజుల్లో డబ్బులు లేని వారు నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికల్లో ఆస్తులు ముఖ్యం కాదు.. సేవాభావం, నిబద్ధత ఉన్న వారినే ఎ న్నుకోవాలి. ప్రజాక్షేత్రంలోనే ఉంటూ అభివృద్ధిపై అంకితభావం ఉన్నవారినే గెలిపించాలి. – పచ్చిపాల సుబ్బయ్య, టీచర్‌

మాటలు కాదు.. చేతల్లో చూపాలి 1
1/1

మాటలు కాదు.. చేతల్లో చూపాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement