● సీఎం చొరవతోనే న్యాయవాద రక్షణ చట్టం బిల్లు ఆమోదం
పాలమూరు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ వల్లే న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు అమోదం పొందిందని, ఉమ్మడి జిల్లా న్యాయవాదుల పోరాటం ఫలించిందని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును శాసనసభలో అన్ని పక్షాలు ఆమోదించేలా సీఎం చొరవ తీసుకున్నారని, ఈ సందర్భంగా సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలంపూర్ న్యాయవాదుల సంఘం సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని పాదయాత్ర చేపట్టారని, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్, మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ పూర్తి సహకారంతో ముందుకు సాగిందన్నారు. భూత్పూర్ వరకు పాదయాత్రకు చేరుకున్న సందర్భంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వంశీకృష్ణ అక్కడికి వచ్చి.. సీఎం దృష్టికి తీసుకువెళ్లి రక్షణచట్టం వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల వల్ల సీఎంను కలవడానికి సాధ్యం కాలేదని.. రెండో విడత మహా పాదయాత్ర కొనసాగించి.. ఫిబ్రవరి 27న సచివాలయానికి చేరుకుని సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం బిల్లు ఆమోదించినట్లు తెలిపారు. ఇకపై న్యాయవాదులపై ఎవరైనా దాడులు చేసినా, ఇబ్బందులకు గురి చేసినా.. అలాంటి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అవుతాయని పేర్కొన్నారు. న్యాయవాదులు ఎవరైనా రక్షణ కావాలని పోలీసులను కోరితే రక్షణ కల్పించేలా చర్యలు తీసుకునే విధంగా చట్టంలో రూపొందించినట్లు చెప్పారు. న్యాయవాదులపై దాడులు జరిగితే డీఎస్పీ స్థాయి అధికారి విచారించేలా చట్టం రూపకల్పన చేశారని గవర్నర్ ఆమోదముద్ర తర్వాత అమల్లోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీధర్‌రా వు, వెంకటయ్య, నాగోజీ, తగిలి కృష్ణ, రాఘవేందర్, ఉమా మహేశ్వరి పాల్గొన్నారు.


