భూ సేకరణ గ్రామసభ బహిష్కరణ
అధికారులతో రైతులు, గ్రామస్తుల వాగ్వాదం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
బల్మూర్: జిల్లాలోని బల్మూర్ సమీపంలో నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ బండ్ (కట్ట) నిర్మాణం కోసం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన అభిప్రాయసేకరణ గ్రామసభను రైతులు తీవ్ర నిరసనల మధ్య బహిష్కరించారు. బల్మూర్ శివారులోని 16 సర్వే నంబర్లలో 46 మందికి చెందిన 52.07 ఎకరాల లావణి పట్టా భూముల్లో బండ్ (కట్ట) నిర్మాణం కోసం భూమి అవసరమైనందున్న 10(ఏ) యాక్ట్ ప్రకారం భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సోమవారం గ్రామసభ నిర్వహించారు. ముందుగా ఆర్‌ఐ సీతారాం భూ నిర్వాసితుల పేర్లు చదివి వినిపించగా.. స్పందించిన రైతులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గ్రామసభ పెట్టడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం తీసుకోవాల్సిన అనుమతులు పొందకుండానే ప్రాజెక్టు పనులు ప్రారంభించి రైతులను విడగొట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితిల్లో రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెగేసి చెబుతూ.. సర్పంచ్ శిరీషతోపాటు రైతులు అధికారుల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు 2,200 ఎకరాల భూములను రైతులు ప్రాజెక్టులో కోల్పోతుండగా కేవలం 52.07 ఎకరాల్లో లావణి పట్టాలు కలిగిన నిర్వాసిత రైతులు 46 మంది పేర్లతో అధికారులు అభిప్రాయ సేకరణ కోసం గ్రామసభ పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూ సేకరణ అభిప్రాయ సేకరణ కోసం అధికారులు నిర్వహించిన గ్రామసభలో రైతుల నుంచి ఆందోళనలు జరుగుతాయని ముందస్తు సమాచారంతో అచ్చంపేట సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు రాజేందర్, వెంకటేష్‌గౌడ్, వెంకట్‌రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులు తమ డిమాండ్లను శాంతియుతంగా అధికారులకు తెలపాలని సూచించారు. దీంతో రైతులు పోలీసులతో తమ గొంతు నొక్కిస్తూ.. కేసులు పెట్టి భయభ్రంతులు గురిచేస్తున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైతులు గ్రామసభను బహిష్కరించి వెళ్లడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మాట్లాడుతున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి
గ్రామసభ రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న నిర్వాసిత రైతులు
తమ మధ్య చీలిక
తీసుకురావొద్దని ఆగ్రహం
ఎన్జీటీ ఆదేశాలు
అమలు చేయాలని వినతి
బల్మూర్‌లో భారీగా పోలీసు బందోబస్తు
రిజర్వాయర్‌కు సరైన అనుమతులు లేకపోవడంతో తాము జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయించామని రైతులు రఘుమారెడ్డి, సుందర్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, తిరుపతయ్య తెలిపారు. దీనిపై రిజర్వాయర్‌కు అవసరమైన అనుమతులు లేనిదే పనులు చేపట్టవద్దని ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండురోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీని ప్రకారం రిజర్వాయర్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎన్జీటీ ఉత్తర్వుల ప్రతులు, వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. దినిని ఉన్నతాధికారులకు నివేధించడంతో పాటు గ్రామసభలో రైతులు వ్యక్త పరిచిన ఆంశాలను తెలుపనున్నట్లు అధికారులు తెలిపారు.
భూ సేకరణ గ్రామసభ బహిష్కరణ


