కాసుల గలగల..
ఏకకాలంలో చెల్లించారు..
● జోరుగా ఆస్తి, కుళాయి పాత బకాయిలు వసూలు
● అభ్యర్థితోపాటు ప్రతిపాదకుల
పన్నులన్నీ క్లియర్
కల్వకుర్తి టౌన్: ఎన్నికల పుణ్యమా అని మున్సిపాలిటీలకు చాలావరకు పేరుకుపోయిన పాత బకాయిలు వసూలయ్యాయి. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులతోపాటు ప్రతిపాదకుల ట్యాక్స్‌లు క్లియర్ చేస్తుండటంతో జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం సమకూరింది. ఎన్నికల నేపథ్యంలో మూడు రోజులలో చాలావరకు కలెక్షన్లు వసూలు అయ్యాయి. ప్రతి ఏడాది మార్చి నెలలో ఎంతో పకడ్బందీగా చేపట్టి కలెక్షన్లను మున్సిపల్ అధికారులు రాబడతారు. కానీ, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు బయట తిరగకుండానే.. ప్రజలే కార్యాలయానికి వచ్చి ట్యాక్స్‌లు కట్టేందుకు క్యూలైన్లలో నిల్చుని మరీ చెల్లించారు.
రెండు, మూడేళ్లవి సైతం..
మున్సిపాలిటీలలో చాలా వరకు రెండు, మూడేళ్లకు సంబంధించిన పన్నులు పేరుకుపోయాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులతోపాటు ప్రతిపాదకులవి సైతం పాత బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా కుళాయి పన్నులు ఆన్‌లైన్ చేయడంతో ప్రజలంతా కుళాయి బిల్లులకు రావడం లేదని, తర్వాత చూద్దామని ప్రజలు వదిలేశారు. ఇప్పుడు అది అంతా ఆన్‌లైన్ కావడంతో అందరికి ఓవరాల్‌గా సుమారు రూ.3– 5 వేల మధ్యలో ఆయా మున్సిపాలిటీలలో నల్లాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో వచ్చాయి. అందరూ ట్యాక్స్‌లు క్లియర్ చేశాక నోడ్యూ కోసం వెళితే అక్కడి అధికారులు నల్లా బిల్లులు సైతం క్లియర్ చేయాలని చెప్పడంతో విషయం వారికి అవగతమైంది. ఇలా జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో కలిసి సుమారు ఆస్తి పన్ను రూ.50 లక్షలు, నల్లా పన్ను రూ.12 లక్షలు వసూలు అయ్యాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి తనకు సంబంధించిన సుమారు రూ.16 లక్షలు పన్నులు చెల్లించాడని అధికారులు తెలిపారు.
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆస్తి, నల్లా పన్నులు బాగానే వసూలయ్యాయి. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న చాలామంది పన్నులు ఏకకాలంలో కట్టేశారు. అభ్యర్థితోపాటు ప్రతిపాదకుడి ట్యాక్స్‌లు క్లియర్ ఉండాలనే నిబంధనతో మందుకు వచ్చారు. పన్నులు చెల్లించిన తర్వాత వార్డు ఆఫీసర్లు వారికి నోడ్యూ సర్టిఫికెట్లను ట్యాక్స్‌లకు సంబంధించి జారీచేశారు. – మహమూద్ షేక్,
మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి
ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలకు సమకూరిన ఆదాయం


