బ్యాలెట్‌తోనే మున్సి‘పోల్స్’
● వార్డుకు రెండు చొప్పున బాక్సులు
● బ్యాలెట్ ముద్రణకు రంగం సిద్ధం
అచ్చంపేట: మున్సిపల్ ఎన్నికలను మరోసారి బ్యాలెట్ పేపర్‌తోనే నిర్వహించనున్నారు. 2014లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో పోలింగ్ నిర్వహించగా.. 2020లో ఈవీఎంలను మార్చి బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా బ్యాలెట్‌తోనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఉన్న వార్డుల ప్రకారం బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడంతో పాటు బ్యాలెట్ పేపర్ ముద్రణను అధికార యంత్రాంగం పూర్తిచేస్తోంది. నామినేషన్ల పర్వం ముగిసిన వెంటనే బ్యాలెట్ పేపర్ల ముద్రణ సుమారు ఐదు రోజుల్లోనే పూర్తి చేయనున్నారు.
చిక్కులు తప్పవు..
ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణతో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాలెట్ పేపర్‌లో ఓటు ముద్ర సరిగ్గా పడకపోవడం కొంత చిక్కులకు దారి తీస్తుంది. అదే విధంగా బ్యాలెట్ పేపర్‌ను మడతపెట్టే క్రమంలో రెండు వైపులా పడటం మరో సమస్యగా మారనుంది. నిరక్షరాస్యులు ఓటు వేయడంలో గందరగోళానికి గురై కొన్ని సందర్భాల్లో బ్యాలెట్‌పై ఏదో ఒకచోట ఓటు ముద్ర వేయడం అభ్యర్థుల తలరాతను తలకిందులు చేసే అవకాశాలు ఉన్నాయి. కౌంటింగ్ సందర్భంగా చెల్లని ఓట్ల విషయంలో వివాదాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థులను తిరస్కరించడానికి అవకాశం ఇచ్చే నోటాకు అవకాశం లేకుండా పోతుంది. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్‌తో నిర్వహించడానికి నిర్ణయం జరిగిన క్రమంలో చెల్లని ఓట్ల విషయంలో కౌంటింగ్ సిబ్బంది జాగ్రత్తగా ఉండ్సాలిందే.


