పేదలకు మెరుగైన వైద్యసేవలు
వెల్దండ: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయన ఆస్పత్రిలోని ఓపీ నమోదు విభాగం, ల్యాబోరేటరీ, ఇన్ పేషెంట్ తదితర విభాగాలను పరిశీలించారు. సిబ్బంది హాజరు వివరాలు, రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందిస్తున్న వైద్య సేవల అమలు తీరుపై ఆరాతీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవసరమైన నూతనంగా నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు. భవనాన్ని పూర్తిచేసి త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని డీఎంహెచ్‌ఓ రవికుమార్‌ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని అధికారులకు సూచించారు. సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను సర్పంచ్ యాదమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రవికుమార్, తహసీల్దార్ కార్తీక్‌కుమార్, వైద్యులు సింధు, చంద్రసింగ్ తదితరులు పాల్గొన్నారు.


