ముమ్మరంగా వన్యప్రాణుల గణన
మన్ననూర్/ లింగాల: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో నేషనల్ టైగర్ కన్జర్వేటర్ (ఎన్‌టీసీ) న్యూఢిల్లీ ఆదేశాల మేరకు అటవీ శాఖ చేపట్టిన వన్యప్రాణుల గణన ముమ్మరంగా కొనసాగుతుంది. 2,611 చ.కి.మీ., పరిధిలో విస్తరించి ఉన్న అభయారణ్యంలో ఆరు రోజుల పాటు సర్వే నిర్వహించనున్నారు. అన్నిరకాల వన్యప్రాణుల లెక్క తేల్చనున్న ఈ గణనలో అటవీశాఖ సిబ్బందితోపాటు డెహ్రాడూన్ నేషనల్ ఆఫ్ ఇండియా, కన్జర్వేటర్ అథారిటీతోపాటు 133 మంది వన్యప్రాణి ప్రేమికులు, వలంటీర్లు పాల్గొంటున్నారు. ఈ గణన శాకాహారం, మాంసాహార జంతువులు నేరుగా చూసినవి పాదముద్రలు, మలం, చెట్లకు అంటుకుని ఉన్న వెంట్రుకలు తదితరాలను రెండు విభాగాలుగా సేకరించి సర్వే నిర్వహిస్తారు. గతంలో అభయారణ్యంలో అమర్చిన సీసీ కెమెరా పుటేజీలను కూడా ఆధారం చేసుకుంటున్నారు. సేకరించిన సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే శాకాహార జంతువుల గణన పూర్తి కాగా మాంసాహార జంతువుల గణన జరుగుతుందని పేర్కొన్నారు. శనివారం చేపట్టిన సర్వేలో పెద్దపులి, చిరుతపులి, ఎలుగుబంటి, రేసు కుక్కలు, అడవి పిల్లి వంటి వన్యప్రాణుల ఉనికిని గమనించామని లింగాల ఎఫ్‌ఆర్‌ఓ ఈశ్వర్ తెలిపారు.


