బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: సమాజంలో బాలికల పట్ల లింగ వివక్ష చూపకుండా వారిని బాలురతో సమానంగా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో బాలికలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని, ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నారు. విద్యార్థి దశ అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైనదని, సరైన మార్గంలో నడిచి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని సబ్‌జైలును సదర్శించి ఖైదీలతో మాట్లాడి వారికి కల్పిస్తున్న వసతుల గురించి తెలుసుకున్నారు. ఎవరైనా న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేని వారికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ తరపున ప్రభుత్వ న్యాయవాదిని నియమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ గుణశేఖరనాయుడు, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ భవానిబాయి తదితరులు పాల్గొన్నారు.


