బాధితులకు అండగా..
1930కు ఫిర్యాదు చేయండి
● సైబర్ నేరాలు అరికట్టేందుకు
పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
● 22 పోలీస్‌స్టేషన్ల పరిధిలో
22 మంది వారియర్స్ ఏర్పాటు
● జిల్లాలో విస్తృతంగా అవగాహన
కార్యక్రమాలు
● ప్రజలను చైతన్యం చేసేందుకు తమవంతుగా కృషి
● అత్యుత్తమ ప్రతిభచూపిన ఇద్దరికి
రాష్ట్రస్థాయిలో రివార్డులు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చదువురాని అమాయకులతోపాటు చదువుకున్న వారు సైతం అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల బారినపడి తమ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. మరికొందరేమో తమ వ్యక్తిగత డేటాను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండటంతో సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో సైబర్ నేరగాళ్ల బారిన పడి ఎంతోమంది మోసపోతుండటంతో నిత్యం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఎస్పీ కృషి చేస్తున్నారు.
టెక్నాలజీతో ఆధారాలు సేకరించి..
సైబర్ నేరగాళ్ల బారిన పడిన వారికి ఆసరాగా ఉండేందుకు, పోయిన నగదును తిరిగి బాధితులకు అందజేసేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో 22 మంది సిబ్బందిని ఎంపిక చేసి సైబర్ వారియర్స్ ఏర్పాటు చేశారు. వీరికి సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు సైబర్ వారియర్స్‌కు ప్రత్యేక సెల్‌ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసింది. సైబర్ కేసుల్లో పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి నేరస్తులను గుర్తించడంతోపాటు సైబర్ నేరగాళ్లకు శిక్షపడేలా చూస్తున్నారు.
రెండేళ్లలో సైబర్ నేరాలు ఇలా..
జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. బాధితులు సత్వరమే పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే సైబర్ వారియర్స్ బాధితుల నగదు పోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. 2024 సంవత్సరంలో 104 కేసుల్లో 12 కేసులను పోలీసులు ఛేదించగలిగారు. ఇందులో రూ.3.24 కోట్ల నగదు పోగొట్టుకుంటే రూ.10.68 లక్షల నగదు రికవరీ చేశారు. ఇక 2025లో 142 కేసుల్లో 17 కేసులను పోలీసులను ఛేదించారు. ఇందులో రూ.2.29 కోట్ల నగదును బాధితులు పోగొట్టుకుంటే రూ.20.78 లక్షల సొత్తును రికవరీ చేశారు. గతేడాది పోలీసుశాఖ ఆధ్వర్యంలో 943 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజలు సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్లు వచ్చినప్పుడు స్పందించకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. మారుతున్న కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త, కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకున్నప్పుడే మోసపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరంతరం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన వారికి అండగా నిలిచేందుకు 22 పోలీస్‌స్టేషన్లలో శిక్షణ పొందిన సైబర్ వారియర్స్ ద్వారా సేవలు అందిస్తున్నాం. – సంగ్రామ్‌సింగ్ జి పాటిల్, ఎస్పీ
బాధితులకు అండగా..
బాధితులకు అండగా..


