భ్రూణ హత్యల నివారణకు పటిష్ట చర్యలు
నాగర్‌కర్నూల్: జిల్లాలో భ్రూణ హత్యలు, మహిళల గర్భాశయ క్యాన్సర్, మాతాశిశు మరణాలను నివారించడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో డీఎంహెచ్‌ఓ రవినాయక్, వైద్యులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బందితో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెయ్యి మంది బాలురకు 892 మంది బాలికల నిష్పత్తి మాత్రమే ఉందని, ఇంకా ముఖ్యంగా చారకొండ, లింగాల మండలాల్లో మరింత తక్కువగా ఉందన్నారు. అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల నుంచి ప్రజలు ఎక్కువగా కర్నూలుకు వెళ్లి అబార్షన్లు చేయిస్తున్నారనే సమాచారం ఉందని అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యశాఖను ఆదేశించారు. అలాగే జిల్లాలో గతేడాది 8 మాత, 58 శిశు మరణాలు నమోదయ్యాయని, ఈసారి ఏ మరణం సంభవించకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిరక్ష్యం కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయనే భావన ప్రజల్లో ఉండదని, ఇకపై ఇవి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో 14– 15 ఏళ్లలోపు ఉన్న 10 వేల మంది బాలికలకు తప్పనిసరిగా వ్యాక్సిన్లు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆరోగ్య విషయాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యులు అందుబాటులో ఉంటూ సరైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అనంతరం భ్రూణహత్యలపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించేలా గోడపత్రికలు విడుదల చేశారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్‌ఓ తారాసింగ్, ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ తదితరులు పాల్గొన్నారు.
పీఎంశ్రీ నిధులు వినియోగించుకోండి
పీఎంశ్రీ పాఠశాలలకు మంజూరైన నిధులను వందశాతం వినియోగించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో డీఈఓ రమేష్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపికై న 27 పీఎంశ్రీ పాఠశాలలకు రూ.1.82 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, వాటిని విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు వెచ్చించాలని సూచించారు. సమావేశంలో జిల్లా ట్రెజరీ అధికారి అబ్దుల్ రషీద్, సెక్టోరియల్ అధికారులు, పీఎంశ్రీ పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.


