రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి

Jan 22 2026 7:49 AM | Updated on Jan 22 2026 7:49 AM

రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి

రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి

ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగావ్యవహరించాలి

కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌: ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి చేపట్టిన ‘అరైవ్‌ అలైవ్‌’ అవగాహన ర్యాలీని ఎస్పీ డా.సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. పోలీసు సిబ్బంది, విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ అంబేడ్కర్‌ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. దేశంలో ప్రతి గంటకు సగటున 55 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ వంటి నిర్లక్ష్యపు చర్యలతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. ప్రమాదాలు రోజువారీ జీవితంలో సాధారణంగా మారిపోతున్నాయని.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక స్పృహతో కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడిపితే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అన్నారు.

● ఎస్పీ డా.సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందన్నారు. కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేసే సమయంలోనే డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని రవాణాశాఖ అధికారులకు సూచించారు.

● ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యం ఎంత ముఖ్యమో, డ్రైవింగ్‌లో జాగ్రత్త కూడా అంతే ముఖ్యమన్నారు. తప్పనిసరిగా ట్రాఫిక్‌ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగితే కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టి సమాజంలో మార్పునకు దోహదపడాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్‌ కళాశాల, డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నాటక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతికశాఖ కళాకారులు రోడ్డు భద్రతపై పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీటీఓ బాలు, డీఎస్పీ శ్రీనివాస్‌, డీఎంహెచ్‌ఓ రవినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement