పట్టణాల్లో సందడి..
మున్సిపల్ ఎన్నికలపై ప్రధాన పార్టీల ఫోకస్
సాక్షి, నాగర్‌కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే పట్టణాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఎన్నికలకు కీల కమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఖరారైన రిజర్వేషన్లకు అనుగుణంగా ఆశావహు లు పావులు కదుపుతున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా అచ్చంపేట మున్సిపాలిటీ పాలకవర్గ పదవీకాలం మరో నాలుగు నెలల పాటు మిగిలి ఉంది. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ చైర్మన్ స్థానం బీసీ మహిళకు కేటాయించగా, కల్వకుర్తి చైర్మన్ స్థానం జనరల్ మహిళకు, కొల్లాపూర్ చైర్మన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. రిజర్వేషన్ కలసివచ్చిన నేతలు మున్సిపాలిటీల చైర్మన్, వార్డు స్థానాలకు పోటీచేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు.
మున్సిపోల్స్‌పై ప్రధాన పార్టీల దృష్టి..
మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ స్థానంతో పాటు వార్డు స్థానాలకు పోటీచేసేందుకు ఆశావహుల జాబితా పదుల సంఖ్యలో కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కై వసం చేసుకుని చైర్మన్ స్థానాలను దక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించి పట్టునిలుపుకోవాలని బీఆర్‌ఎస్ పట్టుదలతో ఉంది. బీజేపీ సైతం అర్బన్ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తాము ప్రభావితం చేసేలా స్థానాలను సొంతం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులుగా గెలుపు గుర్రాలను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి.
కొల్లాపూర్ కాంగ్రెస్‌లో పోటీ తీవ్రం..
జిల్లాలోని కొల్లాపూర్ మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో పదిమంది వరకు ఉండటం గమనార్హం. దాదాపు పోటీ చేస్తున్న వారందరూ చైర్మన్ పదవిని ఆశిస్తుండటంతో ఎన్నికల వేళ ఆ పార్టీలో ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ పదవి కోసం మాజీ చైర్మన్ మేకల రమ్య, మాజీ కౌన్సిలర్లు శ్రీదేవి గౌతమ్‌గౌడ్, పిన్నంచెట్టి జ్యోతి, వంగ అనూష రాజశేఖర్, మాజీ వైస్ చైర్మన్ మహమ్ముదా బేగం, మాజీ కౌన్సిలర్లు బరిగెల శ్రీలక్ష్మి, మేకల శిరీష, గుండ్రాతి శిల్పగౌడ్ ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌లో చైర్మన్ పదవి కోసం పెద్దసంఖ్యలో ఆశావహుల నుంచి పోటీ ఉండటంతో ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు ఏ విధంగా సర్దుబాటుచేస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల్లో పెరుగుతున్న ఆశావహులు
అందరి దృష్టి చైర్మన్ పదవిపైనే
రిజర్వేషన్ల ఖరారుతో ప్రయత్నాలు ముమ్మరం


