వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ చూపాలి
కందనూలు: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆర్‌జేడీ సోమిరెడ్డి సూచించారు. బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ రమేశ్‌కుమార్‌తో కలిసి విద్యాశాఖ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేసేలా సెక్టోరియల్ అధికారులు, మండల విద్యాధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను తరచుగా తనిఖీలు చేసి విద్యాభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. విద్యాప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. పీఎంశ్రీ నిధులను వందశాతం వినియోగించిన పెద్దకొత్తపల్లి కేజీబీవీ ప్రత్యేకాధికారిని ఆర్జేడీ అభినందించారు. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలకు కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సమగ్రశిక్ష గణాంక అధికారి మధుసూదన్‌రెడ్డి, సెక్టోరియల్ అధికారులు షర్ఫుద్దీన్, నూరుద్దీన్, వెంకటయ్య, శోభారాణి, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, సుజాత, వెంకటేశ్వర్లు శెట్టి ఉన్నారు.


