విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
మన్ననూర్: వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం ఆయన మన్ననూర్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాల/ వసతి గృహం పరిసరాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం తరపున కల్పించే సౌకర్యాలు, ప్రతిరోజు అందించే పౌష్టికాహారం నాణ్యతతోపాటు మెనూ సక్రమంగా పాటిస్తున్నారా అనే విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులు, వసతి గృహం స్టోర్ రూం, భోజనశాల, పడక గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం (ఫిల్టర్ వాటర్ ప్లాంట్)లను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించాలని, పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్లను పరిశీలించి హెచ్‌ఎం, హెచ్‌డబ్ల్యూఓ తిరుపతమ్మకు సూచనలు చేశారు.
అధికారులతో సమీక్ష
ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ, డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర, సిబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గవర్నర్ కోటా నుంచి విడుదలైన నిధులతో అటవీ లోతట్టు ప్రాంతాల్లోని చెంచుపెంటల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెంచుపెంటల్లో తాగునీటి సమస్య రాకుండా మంచినీటి బావులు, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యాలయం, ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ, సంక్షేమ, జీవీవీకే పాఠశాలల నిర్వాహణ తదితర అంశాల గురించి చర్చించారు.
మద్దిమడుగులో స్థల పరిశీలన
అమ్రాబాద్: పదర మండలం మద్దిమడుగు పబ్బతి శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శేషవస్త్రాలు అందజేశారు. అనంతరం ఆలయ సమీపంలో ఏర్పాటు చేయనున్న సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ స్థాపనకు స్థలాన్ని పరిశీలించారు.


