గణనకు సిద్ధం
● పక్కాగా వన్యప్రాణుల లెక్క
● నల్లమలలో నేటినుంచి నుంచి 25 వరకు లెక్కింపు
● 214 బీట్లలో జంతు సర్వేకు అటవీశాఖ సన్నాహాలు
● ఈసారి కొత్తగా ఔత్సాహిక వలంటీర్లకు అవకాశం
● ఎప్పటికప్పుడు ఏఐటీఈ యాప్‌లో నమోదు
అచ్చంపేట: పులులు, జంతువుల లెక్క తేల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. నాలుగేళ్లకోసారి జనవరి నెలలో వన్యప్రాణి గణన నిర్వహించనుండగా.. సోమవారం నుంచి ఈ నెల 25 వరకు ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలోని అమ్రాబాద్ అభయారణ్యంలో లెక్కింపునకు రంగం సిద్ధం చేశారు. డెహ్రాడూన్ వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) ఆధ్వర్యంలో గణన చేపడుతున్నారు. పులులతోపాటు శాకాహార, మాంసాహార జంతువులు ఎన్ని ఉన్నాయనే వివరాలు సైతం సేకరిస్తారు.
ఎంపిక చేసిన టీంలలో ఇద్దరు చొప్పున సభ్యులు ప్రతిరోజు ఐదు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో పర్యటించి జంతు గణన చేపడుతారు. ఇందుకు గాను అడవిలో మార్కింగ్, డైరెక్షన్స్, మ్యాపులను అధికారులు ప్రకటించారు. గణన నిర్వహించే బయటి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. కాగా మొదటి విడతగా 19 నుంచి మూడురోజుల పాటు మాంసాహార జంతువుల గణన కొనసాగనుంది. ఇందులో కేవలం జంతువుల వివరాలు, పాదముద్రలు సేకరిస్తారు. 23 నుంచి మూడు రోజులపాటు శాకాహార జంతువుల గణన ఉంటుంది. ఈ మేరకు గుర్తించిన వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఏఐటీఈ (ఆలిండియా టైగర్స్ ఎస్టిమేషన్) యాప్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. సర్వే సిబ్బందికి టీషర్టులు, క్యాప్‌లతోపాటు ఓ కిట్ బ్యాగ్ ఇస్తారు. అందులో పేపర్, పెన్ను, జిప్‌లాక్ (ఆనవాళ్ల సేకరణకు ఉపయోగించే పదార్థం) ఉంటాయి.
అమ్రాబాద్ అభయారణ్యంలో జీవ వైవిధ్యంతోపాటు జంతువుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండటంతో వాటి సంతతి పెరుగుతోంది. గత జంతుగణన సమయంలో వేల సంఖ్యలో వన్యప్రాణులు ఉన్నాయి. పులులు, చిరుతలతోపాటు ఎలుగుబంట్లు, తోడేళ్లు, జింకలు, నక్కలు, రేసు కుక్కలు, కొండ గొర్రెలు, చుక్కల దుప్పులు, కణతులు, కుందేళ్లు, మూషిక జింకలు, అడవి పందులు పెద్దమొత్తంలో మనుగడ సాగిస్తున్నాయి.
బీట్‌కు ఇద్దరు చొప్పున కావాల్సిన సిబ్బంది 428


