ట్రాఫిక్ నియమాలు బాధ్యతగా పాటించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: వాహనదారులు ట్రాఫిక్ నియమాలను భయంతో కాకుండా బాధ్యతగా పాటించాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ అంటే కేవలం ట్రాఫిక్ నియమాలను భయంతో పాటించడం కాకుండా బాధ్యతాయుతంగా ఇది మన జీవితాలను కాపాడుకోవడం కోసం, కుటుంబం రక్షణ కోసం పాటించాలన్నారు. అతివేగం, తాగి వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల పెద్ద ప్రమాదాలు జరిగి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని, కాబట్టే రోడు భద్రత నిబంధనలను ప్రతిఒక్కరు పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదం వల్ల ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని ఆ వ్యక్తి లేని బాధలను ఆ కుటుంబానికి ఎవరూ తీర్చ లేరని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు రోడ్ సేఫ్టీ గురించి నేర్పించాలన్నారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బాధపడడం కాకుండా రోడు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్య, డీఎస్పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


