ముసాయిదా ఓటరు జాబితాపై 51 ఫిర్యాదులు
నాగర్‌కర్నూల్: రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో సవరణలకు సంబంధించి శనివారం వరకు మొత్తం 51 దరఖాస్తులు వచ్చాయని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఇందులో 28 దరఖాస్తులను పరిష్కరించగా.. 23 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందన్నారు. ఓటరు జాబితాలో ఇంకా ఏమైనా సవరణలు ఉంటే ఓటర్లు మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉందన్నారు. ఆదివారం కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించిన తర్వాత జనవరి 10న తుది ఎన్నికల జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు.
16న అంతర్రాష్ట్ర
బండలాగుడు పోటీలు
కోడేరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండల కేంద్రంలో ఈ నెల 16న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్లు పొండేళ్ల సురేష్, పుట్టరాము, సొప్పరి పెద్దబాలపీరు, రమేష్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే వృషభాలకు మొదటి బహుమతి రూ.80 వేలు, ద్వితీయ బహుమతి రూ.60 వేలు, తృతీయ బహుమతి రూ.50 వేలు, నాల్గో బహుమతి రూ.40 వేలు, 5వ బహుమతి రూ.30 వేలు, 6వ బహుమతి రూ.20 వేలు, 7వ బహుమతి రూ.15 వేలు, 8వ బహుమతి రూ.10 వేలు అందిస్తామన్నారు. పోటీలో పాల్గొన్న మిగిలిన ఎద్దుల జతకు రూ.5 వేలు అందించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 95506 55324, 97012 28596, 81065 62850 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
కబడ్డీ పోటీలు
కోడేరు మండల కేంద్రంలో ఈ నెల 13 నుంచి 16 వరకు అంతర్రాష్ట్ర కబడ్డీ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ వంశీధర్‌రావు, ఆది కిరణ్, బండారి విష్ణు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు అందించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, పాల్గొనే వారు 96407 88688, 85505 20859, 93473 86300కు సంప్రదించాలన్నారు.
‘అసైన్డ్ భూములను
కాపాడాలి’
కందనూలు: అసైన్డ్ భూములను కాపాడాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఊర్కొండ పేట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 180లో 4 ఎకరాల 10 గుంటల భూమిని 2006 సంవత్సరం గిరిజనులకు కేటాయించారు. అట్టి అసైన్డ్ భూముని ప్రస్తుత ఊర్కొండపేట తహసీల్దార్ ఇతర వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సీలింగ్ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అదే మండలంలోని ఊర్కొండ గ్రామంలో మరో సర్వేనంబర్ 168లో ఉన్న అసైన్డ్ భూమిని ఇతరుల పేర పట్టా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై జాతీయ ఎస్టీ కమీషన్‌కు గతంలో ఫిర్యాదు చేశామన్నారు. శనివారం కలెక్టర్ బదావత్ సంతోష్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి ఇతరులకు పట్టా చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, ప్రధానకార్యదర్శి నాగేందర్‌గౌడ్, చందు తదితరులు పాల్గొన్నారు.


